పవన్‌ మాటే ఫ్యాక్షనిజం | MLC Alla Nani Critics Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ మాటే ఫ్యాక్షనిజం

Published Wed, Oct 17 2018 1:46 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

MLC Alla Nani Critics Pawan Kalyan - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఫ్యాక్షనిజం’ అనేది జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాటల్లోనే తొంగి చూస్తోందని వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్‌ ప్రతి బహిరంగ సభలోనూ ‘నలిపేస్తాం.. తాటతీస్తాం.. తన్ని తరిమేస్తాం.. గోదాట్లో కలిపేస్తాం...!’ లాంటి రెచ్చగొట్టే భాష మాట్లాడటాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసన్నారు. ‘పవన్‌ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రక్తానికి రక్తమే సమాధానమంటారు. దీన్నిబట్టి ఎవరు ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారో బోధపడుతోంది’ అని ఆళ్ల నాని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

పద్ధతి మారకుంటే గోదాట్లో కలిసేది జనసేనే..
‘పవన్‌ గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా లోకేష్‌ అవినీతిని చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందంటారు. ఇక్కడికి వచ్చి లోకేష్‌ నా తమ్ముడులాంటి వాడంటారు. టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై పైకి మాత్రం విమర్శలు చేస్తూ ఇక్కడికి వచ్చి వైఎస్సార్‌ సీపీని గోదాట్లో కలిపేస్తానంటూ మాట్లాడుతున్నారు. మీ పద్ధతి, వ్యవహార శైలి మార్చుకోకుంటే జనసేన పార్టీని అదే గోదాట్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే సహించరు..
జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాక్షనిస్టు అని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని పవన్‌ అంటారు. ఆయన అనంతపురం వెళ్లినప్పుడు కొన్ని పరిస్ధితుల వల్ల ఫ్యాక్షనిస్టులు తయారయ్యారని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు రాయలసీమ గూండాలంతా దోచుకు తింటున్నారంటూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతారు. పవన్‌ ఇలా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు తిరగబడి తరిమికొడతారు. 

కుమ్మక్కై జగన్‌పై కేసులు బనాయించారు..
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లడం గానీ లేదా ఏ మంత్రి దగ్గరకైనా వచ్చారా? ఐఏఎస్‌ అధికారులతో ఎప్పుడైనా మాట్లాడారా? మాటకు ముందు రూ.లక్షల కోట్ల అవినీతి అంటారు. మరి దానికి సంబంధించి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఈ కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జగన్‌ను జైలు పాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మీద ఇన్ని కేసులు పెట్టారు. ఏ కేసైనా రుజువైందా? పవన్‌ కల్యాణ్‌ ఇవేవీ ఆలోచించకుండా లక్ష కోట్ల అవినీతి అంటూ బురద చల్లడం సమంజసమేనా? జగన్‌కు అధికారమే పరమావధి అయితే ఎప్పుడో సీఎం అయ్యేవారు. వైఎస్సార్‌ చనిపోయిన తరువాత ఓదార్పుయాత్ర చేపట్టకుండా, కాంగ్రెస్‌ను వీడకుండా ఉంటే జగన్‌ కేంద్ర మంత్రి అయ్యేవారు. లేదంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌ గతంలో వ్యాఖ్యానించారు. జగన్‌ ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయంటూ యనమల రామకృష్ణుడు ముందుగానే చెప్పడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం.

రాజారెడ్డిని హత్య చేస్తే ప్రతీకార చర్యలకు దిగలేదు..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి టీడీపీ నాయకుల చేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన హత్య జరిగిన తరువాత రాజశేఖరరెడ్డి సీఎం అయినా ఎక్కడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. అంతా చట్టం చూసుకుంటుందని చెప్పారు. అలాంటి రాజశేఖరరెడ్డి, విజయమ్మల కడుపున పుట్టిన జగన్‌పై విమర్శలు చేయడం అంటే ఆయనపై బురద జల్లడమే. 

మీది ‘చిరు’ వారసత్వం కాదా?
వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు పవన్‌కు ఎక్కడుంది? మీరు సినిమాల్లోకి వచ్చింది వారసత్వంగా కాదా? చిరంజీవి వారసత్వంగా మీరొచ్చారు. ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అది మీకు చిరంజీవి వారసత్వంగానే వచ్చింది. ఆ వారసత్వాన్ని పట్టుకుని ప్రతి సభలోనూ ముఖ్యమంత్రి అవడానికి నాకు అర్హత లేదా? అంటూ మీరు అడగడం లేదా?

ఐదు కోట్ల మంది భవిష్యత్తును హేళన చేయొద్దు..
ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఢిల్లీ వెళ్లలేదని అడిగితే చంద్రబాబు తనను రమ్మని పిలవలేదంటారు. పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకులే? అని మరో మాట తగిలిస్తారు. ఇది ఎవరి ఇంట్లో పెళ్లి? ఎవరి ఇంట్లో పేరంటమో పవన్‌ చెప్పాలి. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును హేళన చేసినట్లుగా మాట్లాడటం పవన్‌కే చెల్లింది.  

ఢిల్లీలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు దీక్ష చేస్తే కనీసం పరామర్శించలేదు..
ప్రత్యేక హోదా అంశంలో తానే పోరాటం చేశానని పవన్‌ అంటున్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఒక్కడినే బీజేపీతో పోరాడానంటున్నారు. మరి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రాణాలను ఫణంగా పెట్టి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ప్రధాని మోదీకి భయపడి పవన్‌ కనీసం పరామర్శకు కూడా ముందుకు రాలేదు. జనసేన కార్యాలయం, కాకినాడ బహిరంగ సభలో పాచిపోయిన లడ్డూలంటూ మాట్లాడటం మినహా ప్రత్యేక హోదా కోసం ఆయన ఏం చేశారో చెప్పాలి. హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది జగన్‌ మాత్రమే. అక్రమ కేసులకు భయపడకుండా ప్రజల భవిష్యత్తే లక్ష్యంగా నిరాహార దీక్షలు చేసినా, అసెంబ్లీలో పోరాటం చేసినా అది ఒక్క జగన్‌కే సాధ్యమైంది.

చంద్రబాబు చెబితేనే పర్యటనలు జరిపారా?
పర్యటనల పేరుతో పవన్‌ అమరావతి వెళ్లి భూములు చూసి రైతులతో మాట్లాడి పెరుగన్నం తిని వచ్చారు. ఫ్లోరైడ్‌ బాధితుల దగ్గరకు వెళ్లి వారి కష్టాలు తీరుస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల దగ్గరకు వెళ్తారు. సీఎంతో మాట్లాడతానంటారు గానీ చంద్రబాబు గదిలోకి వెళ్లి అక్కడ ఏం మాట్లాడతారో, బయటకు వచ్చాక ఏం మాట్లాడతారో తెలియటం లేదు. పవన్‌ గతంలో చేసిన పర్యటనలన్నీ చంద్రబాబు చెబితేనే చేశారా? బాధితులను  జగన్‌ కలిస్తే ఆయనకు ప్రజాభిమానం దక్కుతుందన్న భయంతో అక్కడ పర్యటనలు చేసినట్లుగా మీరే ఒప్పుకున్నారు. 

జగన్‌పై నిరాధార ఆరోపణలు.. లోకేష్‌కు బుజ్జగింపులు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఫ్యాక్షనిస్ట్‌గా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌ మానసిక స్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థం అవుతోందని ఆళ్ల నాని విమర్శించారు. ధవళేశ్వరం వద్ద జనసేన కవాతు సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను నాని తీవ్రంగా ఖండించారు. కవాతు, సభ ద్వారా పవన్‌ టీడీపీ అరాచకాలను నిలదీసి తమకు అండగా ఉంటారని ప్రజలు ఎదురు చూశారన్నారు. కానీ పవన్‌ కల్యాణ్‌ అధికార పక్షాన్ని, చంద్రబాబును వదిలేసి జగన్‌పై విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు.‘ప్రతిపక్ష నేత జగన్‌ను ఫ్యాక్షనిస్టుతో పోల్చిన పవన్‌ కల్యాణ్‌ని అడుగుతున్నా ఏ రోజైనా ఎవరి మీదైనా ఆయన దౌర్జన్యం చేసినట్లుగా గోదావరి జిల్లాల్లో కానీ వైఎస్సార్‌ జిల్లాలో కానీ ఎక్కడైనా పోలీసు కేసు నమోదైందా? అని ఆళ్ల నాని ప్రశ్నించారు. జగన్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించేందుకు పవన్‌ పడుతున్న తపన బహిరంగ సభలో కనపడిందన్నారు. ఒకపక్క జగన్‌పై నిరాధా రమైన ఆరోపణలు చేస్తూ మరోపక్క నారా లోకేష్‌బాబుకు మాత్రం ‘ఓ అన్నగా చెబు తున్నా.. గడ్డం పట్టుకుని బతిమాలుతున్నా..’ అంటూ పవన్‌ మాట్లాడటం ఏమిటని ఆళ్ల నాని ప్రశ్నించారు. 

టీడీపీ కోసమే పవన్‌ తాపత్రయం..
జగన్‌  అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ అండగా ఉంటానంటూ ముందుకు సాగుతున్నారు. పవన్‌ ఒకపక్క జగన్‌ మీద కోపం లేదంటారు మరోపక్క వైఎస్సార్‌ సీపీ అంటే విసుగు అంటారు. 2007లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో అనామకులు వచ్చి ఆయన పేరు చెప్పి నటించమని ఒత్తిడి చేశారు అందుకే నాకు కోపం అంటారు. ఇలా నిలకడలేని విధంగా మాట్లాడటం పవన్‌కళ్యాణ్‌కే చెల్లింది. టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గద్దెనెక్కించాలనే లక్ష్యంతోనే పవన్‌ పర్యటనలు, ఆయన మాట్లాడే తీరు ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్‌ను అణగదొక్కి టీడీపీని అధికారంలోకి తేవాలనే కుతంత్రం పవన్‌కళ్యాణ్‌లో కనపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement