సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు నిరసనగా బీజేపీ ప్రభుత్వం నిరసనలకు సిద్ధమైపోయింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న బీజేపీ ఎంపీలంతా నిరాహార దీక్ష చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్లమెంట్ నిరవధిక వాయిదా తర్వాత జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"బీజేపీ కలుపుగోలు రాజకీయాల కోసం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మోసపూరిత రాజకీయాలకు తెరలేపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకుంది. పైగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్ధంకండి' అని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
అంతేకాదు దళిత ఆందోళనల నేపథ్యం, వాటిపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు "సబ్ కా సాత్ సబ్ కా యాత్ర' కార్యక్రమానికి మోదీ పిలునిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 నుంచి మే 5 దాకా దేశంలో ఉన్న 20,844 గ్రామాల్లో నేతలంతా ఒక రాత్రి బస చేయాలని.. దళితుల సంక్షేమం కోసం కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ప్రధాని ఎంపీలకు సూచించారంట. పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మోదీ ఈ నిర్ణయాన్ని పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి అంకితమిచినట్లు అనంత్ కుమార్ వెల్లడించారు. అయితే సభను నిర్వహించుకునే మార్గాలున్నప్పటికీ(ఆందోళనకారులపై వేటు వేయటం తదితర చర్యలు..) ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేస్తూ బీజేపీ నిరసనలకు దిగటం విడ్డూరంగా ఉందంటూ పలు జాతీయ పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment