
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదు దఫాల పోలింగ్ ముగిసిపోవడం.. మరో రెండు దఫాల పోలింగ్ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మోదీగారూ మీ సమయం అయిపోయిందని, కేంద్రంలో మార్పు కోసం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకోసం సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మంచి పోలింగ్ శాతం నమోదు కావడాన్ని ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ కనీస ఆదాయ పథకం (న్యాయ్)కు ఓటర్లు ఆకర్షితమై.. పెద్దసంఖ్యలో ఓటువేయడానికి ముందుకొచ్చారని ఆయన విశ్లేషించారు. యువత మాత్రమే కాదు సీనియర్ సిటిజెన్లు సైతం ఉత్సాహంగా ఓటు వేస్తున్నారని పేర్కొంటూ.. న్యాయ్‌కి అనుకూలంగా ఓటు వేయాలంటూ సీనియర్ సిటిజెన్లు కోరుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ దేశవ్యాప్తంగా యువత మాత్రమే కాదు.. అనుభవజ్ఞులైన వృద్ధులు సైతం న్యాయ్ పథకం ఉద్దేశాన్ని గ్రహించి పెద్దసంఖ్యలో ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. మోదీగారూ మీ సమయం అయిపోయింది. మార్పునకు సమయం ఆసన్నమైంది’ అని రాహుల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.