సిద్దరామయ్య
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో రెండోసారి అధికారంలోకి వచ్చి, 2019 లోక్‌సభ ఎన్నికలకు కన్నడ ఫలితాలను ఓపెనింగ్స్‌గా భావించాలని సిద్దరామయ్య తీవ్రంగా శ్రమిస్తుంటే, మరోపక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దక్షిణ భారతంలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రచారంలో భాగంగా మోదీ, అమిత్ షా తమ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వరుస ర్యాలీలపై సిద్దరామయ్య స్పందించారు. ఓ వార్తా ఛానల్‌తో సోమవారం మాట్లాడుతూ... పలు అంశాలను ప్రస్తావించారు.
నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కర్ణాటకలో అంత ప్రజాదరణ లేదని, వారిని ప్రత్యర్థిగా భావించట్లేదన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పనే తమ అసలైన ప్రత్యర్థని సిద్దరామయ్య అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ప్రజాదరణ తగ్గిందని, కన్నడ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. అమిత్‌షా రోడ్ షోలను ప్రజలు పట్టించుకోరని, ఆయన షోలు కామెడి షోలను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా మోదీ, అమిత్ షా ద్వయం వరుస ర్యాలీలతో కన్నడసీమలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా కర్ణాటకలో విజయం కాంగ్రెస్, బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ అధికారి నిలబెట్టుకుని ఈ ఏడాది జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే స్పూర్తిని కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కన్నడ సీమలో విజయం సాధించి దక్షిణ భారతంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాషాయ దళం ప్రయత్నిస్తోంది. కాగా గత నాలుగు దశాబ్ధాల్లో కర్ణాటకకు ఐదేళ్లు సీఎంగా కొనసాగిన వ్యక్తిగా సిద్దరామయ్య చరిత్ర సృష్టించారు. మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment