
సాక్షి, మీరట్ : నరేంద్ర మోదీ కేవలం టీవీల్లో కనిపించే ప్రధానమంత్రి అని సీనియర్ కాంగ్రెస్ లీడర్ గులాంనబీ ఆజాద్ తీవ్రంగా విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 100వ జయంతి ఉత్సవాల నిర్వహణ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రధాని మోదీ పదేపదే ప్రశ్నిస్తున్నారు.. అసలు ఆయనకు చరిత్ర తెలుసా? అని నేను ప్రశ్నిస్తున్నాను అని ఆజాద్ అన్నారు. 1940లో దేశ జనాభా కేవలం 20 కోట్లు.. ఆ సమయంలో వచ్చిన కరువు కాటకాలతో ఒక్క బెంగాల్లోనే 10 లక్షల మంది చనిపోయారు.. ఇది స్వతంత్రం రాకముందు దేశం పరిస్థితి.. ఈ 70 ఏళ్లలో కరువును అధిగమించి.. దేశానికి ఆహారం అందించే స్థాయినుంచి ఎగుమతులు చేసే స్థాయికి కాంగ్రెస్ ప్రధానులు చేర్చారు.. అని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తానని మోదీ హమీ ఇచ్చారు.. ఆయన అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల 15 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆజాద్ విమర్శించారు. నరేంద్రమోదీ టీవీల్లో కనిపించే ప్రధానమంత్రి మాత్రమే.. కానీ కాంగ్రెస ప్రధానులు ప్రజల మధ్య తిరిగే వారు.. అందుకే ప్రజావసరాలు తీర్చారు అని ఆజాద్ చెప్పారు. నాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవమే.. నేడు దేశానికి అన్నం పెడుతోందని ఆజాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment