రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
సూరత్ / దండి: భారత్‌లో తాము అధికారం లోకి రాకముందు ఏ రాజకీయ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో దేశాభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ అస్థిరత కారణంగా కొన్నిరంగాల్లో భారత్ తిరోగమనం దిశగా వెళ్లిందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయం విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ప్రతిపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు.
‘రియల్’ ధరలు తగ్గుముఖం: భారత్‌లో గత 30 ఏళ్లలో ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి దేశాభివృద్ధి కుంటుపడింది. కానీ యువతరం 2014లో విజ్ఞతతో ఆలోచించి ఓటేయడంతో భారత్ ఈరోజు పురోగమిస్తోంది. యువతీయువకుల ఓట్లు 30 ఏళ్ల రోగాన్ని నిర్మూలించాయి. కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఉన్న సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. అధికారం అప్పగిం చినందుకు మీరేం చేశారు? అని ప్రజలు నన్ను ప్రశ్నించవచ్చు. నేను జవాబిచ్చేందుకు సిద్ధం గా ఉన్నా. ఒకవేళ మెజారిటీ కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే మీకు చాలా కారణాలు చెప్పి ఉండేవాడిని.
యూపీఏ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లను నిర్మిస్తే.. మా ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో ఏకంగా 1.30 కోట్ల గృహాల నిర్మాణం పూర్తిచేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాంగ్రెస్‌కు ఇంకో పాతికేళ్లు పడుతుంది’ అని మోదీ తెలిపారు. నోట్ల రద్దుపై స్పందిస్తూ..‘నోట్ల రద్దు తర్వాత యువత తక్కువ ధరలకే వాళ్లు ఇళ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. నోట్ల రద్దు, రియల్‌ఎస్టేట్ నియంత్రణ సంస్థతో రియల్‌ఎస్టేట్ రంగంలో పేరుకుపోయిన నల్లధ నాన్ని నియంత్రించగలిగాం. సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగానే ముద్ర పథకాన్ని తీసుకొచ్చాం’ అని వెల్లడించారు. అగ్రవర్ణాల పేదలకు 10% కోటా కల్పించే విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందన్నారు.
ఆ ప్రశ్నలను ప్రజలు మర్చిపోలేదు...
సూరత్ సభ తర్వాత నవ్‌సరి జిల్లాలోని దండికి చేరుకున్న ప్రధాని.. గాంధీ వర్ధంతి నేపథ్యంలో జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ..‘మహాత్మా గాంధీ దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సందర్భంగా ఇది సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉప్పుకున్న శక్తి, సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం గాంధీకి తెలుసు. అందువల్లే బాపూ ముందుకు సాగారు. ఒకవేళ ఇలాంటి ప్రతికూల మనస్తత్వమున్న వ్యక్తుల ప్రభావానికి గాంధీ లోనై ఉద్యమాన్ని ఆపేసుంటే ఏం జరిగేది? దురదృష్టవశాత్తూ ఇలాంటి వ్యక్తులు మన దేశంలో ఇంకా ఉన్నారు. మరుగుదొడ్లు కట్టడం వల్లే ఏం మార్పు వస్తుంది? ఇది ప్రధాని చేయాల్సిన పనేనా? గ్యాస్ కనెక్షన్లు సామాన్యుల జీవితాన్ని ఎలా బాగుచేస్తాయి? ఇలా వారువేసిన ప్రశ్నలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014 నుంచి ఇప్పటివరకూ 9 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలపై ఆయా దేశాల పౌరులు ఎన్నడూ విమర్శించలేదు’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment