majority of seats
-
‘హంగ్’ అభివృద్ధికి అడ్డు
సూరత్ / దండి: భారత్‌లో తాము అధికారం లోకి రాకముందు ఏ రాజకీయ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో దేశాభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ అస్థిరత కారణంగా కొన్నిరంగాల్లో భారత్ తిరోగమనం దిశగా వెళ్లిందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయం విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ప్రతిపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు. ‘రియల్’ ధరలు తగ్గుముఖం: భారత్‌లో గత 30 ఏళ్లలో ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి దేశాభివృద్ధి కుంటుపడింది. కానీ యువతరం 2014లో విజ్ఞతతో ఆలోచించి ఓటేయడంతో భారత్ ఈరోజు పురోగమిస్తోంది. యువతీయువకుల ఓట్లు 30 ఏళ్ల రోగాన్ని నిర్మూలించాయి. కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఉన్న సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. అధికారం అప్పగిం చినందుకు మీరేం చేశారు? అని ప్రజలు నన్ను ప్రశ్నించవచ్చు. నేను జవాబిచ్చేందుకు సిద్ధం గా ఉన్నా. ఒకవేళ మెజారిటీ కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే మీకు చాలా కారణాలు చెప్పి ఉండేవాడిని. యూపీఏ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లను నిర్మిస్తే.. మా ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో ఏకంగా 1.30 కోట్ల గృహాల నిర్మాణం పూర్తిచేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాంగ్రెస్‌కు ఇంకో పాతికేళ్లు పడుతుంది’ అని మోదీ తెలిపారు. నోట్ల రద్దుపై స్పందిస్తూ..‘నోట్ల రద్దు తర్వాత యువత తక్కువ ధరలకే వాళ్లు ఇళ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. నోట్ల రద్దు, రియల్ఎస్టేట్ నియంత్రణ సంస్థతో రియల్ఎస్టేట్ రంగంలో పేరుకుపోయిన నల్లధ నాన్ని నియంత్రించగలిగాం. సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగానే ముద్ర పథకాన్ని తీసుకొచ్చాం’ అని వెల్లడించారు. అగ్రవర్ణాల పేదలకు 10% కోటా కల్పించే విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందన్నారు. ఆ ప్రశ్నలను ప్రజలు మర్చిపోలేదు... సూరత్ సభ తర్వాత నవ్‌సరి జిల్లాలోని దండికి చేరుకున్న ప్రధాని.. గాంధీ వర్ధంతి నేపథ్యంలో జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ..‘మహాత్మా గాంధీ దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సందర్భంగా ఇది సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉప్పుకున్న శక్తి, సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం గాంధీకి తెలుసు. అందువల్లే బాపూ ముందుకు సాగారు. ఒకవేళ ఇలాంటి ప్రతికూల మనస్తత్వమున్న వ్యక్తుల ప్రభావానికి గాంధీ లోనై ఉద్యమాన్ని ఆపేసుంటే ఏం జరిగేది? దురదృష్టవశాత్తూ ఇలాంటి వ్యక్తులు మన దేశంలో ఇంకా ఉన్నారు. మరుగుదొడ్లు కట్టడం వల్లే ఏం మార్పు వస్తుంది? ఇది ప్రధాని చేయాల్సిన పనేనా? గ్యాస్ కనెక్షన్లు సామాన్యుల జీవితాన్ని ఎలా బాగుచేస్తాయి? ఇలా వారువేసిన ప్రశ్నలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014 నుంచి ఇప్పటివరకూ 9 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలపై ఆయా దేశాల పౌరులు ఎన్నడూ విమర్శించలేదు’ అని మోదీ పేర్కొన్నారు. -
కిషన్ సార్.. గిదేంది?
జిల్లా వెబ్సైట్లో తప్పులు - ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు - పొన్నాల, సారయ్య ఇంకా మంత్రులే.. - కనిపించని కొత్త ఎమ్మెల్యేల ముఖాలు - జిల్లాలో 669 ఎంపీటీసీ స్థానాలేనట.. - కనిపించని తెలంగాణ సర్కారు అంశం జిల్లా ప్రజలకు ఓ మనవి. ‘దీని కోసం ఆఫీసు దాకా రావడమెం దుకు.. ఇంటర్నెట్లో చూసుకోండి’ అని చులకనగా మాట్లాడే కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారుల మాటలు నమ్మకండి. జిల్లా అధికారిక వెబ్సైట్ చూడకండి. ఎందుకంటారా.. అందులో ఉండే వివరాలకు.. వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం దాటినా... జిల్లా వెబ్సైట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారులోని వారే మంత్రులుగా ఉన్నారు. ప్రభుత్వ అధికారిక సమాచారం వెల్లడించే జిల్లా వెబ్సైట్లో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం విషయం అసలే లేదు. సాక్షి ప్రతినిధి, వరంగల్ :సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కాకముందే కలెక్టర్ కిషన్ కలిసి వచ్చారు. జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ సహా కీలక అధికారులందరూ వెళ్లారు. అయితే రాజయ్య డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా గుర్తించడం లేదు. జిల్లా అధికారిక వెబ్సైట్లో పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలా చూడబోతే ఎన్నో వింతలు జిల్లా వెబ్సైట్లో ఉన్నాయి. విదుల్లో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వాన్ని తెలియజేసేలా వెబ్సైట్లో సమాచారం ఉంది. కలెక్టర్ కిషన్ పర్యవేక్షణలో ఉండే అధికారిక వెబ్సైట్లోనే ఇలా ఉండడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో సర్కారు ఏర్పడింది. జిల్లాకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2నే సర్కారు కొలువుదీరింది. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఓరుగల్లు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని చేసిన జిల్లా అధికార యంత్రాంగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిందనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇదొక్కటే కాదు ఏవో ఒకటిరెండు అంశాల్లో తప్పితే ఏ సమాచారం కూడా ఈ వెబ్సైట్లో సరిగా లేదు. వెబ్సైట్లో విచిత్రాలు ఇవీ.. - ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగానే ఉన్నారు. వీరు జనగామ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారట. గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్, మొలుగూరి బిక్షపతి, మాలోతు కవిత, దనసరి అనసూయ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యేలుగా, కొండా మురళీధర్‌రావు ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. - కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలు దగ్గరపడుతోంది. జిల్లా వెబ్సైట్లో మాత్రం వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఇంకా సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ ఎంపీగా బలరాంనాయక్, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నారు. - జిల్లాలో ఇటీవలే 705 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులే ప్రకటించారు. వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం మాత్రం జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలు 669 మాత్రమే. - గత ఏడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వెబ్సైట్లో ఉన్న సమాచారంలో మాత్రం జిల్లాలో 1,014 గ్రామపంచాయతీలు ఉన్నట్లుగా ఉంది. - ఇటీవలే జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలకు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్సైట్లో మాత్రం జిల్లాలో రెండు మాత్రమే పురపాలక సంఘాలు ఉన్నాయి. - 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి ఏడాది దాటుతున్నా జిల్లా వెబ్సైట్లో 2001 గణాంకాలే ఉన్నాయి. వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం మన జిల్లా జనాభా 32.46 లక్షలు ఉంది. - మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్సైట్లో ఉంది. 2012, 2014లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు. -
సీఎం రేసులో లేనంటే ఒప్పుకోరు: జానారెడ్డి
- అతిపెద్ద పార్టీగా అవతరించేది కాంగ్రెస్సే సాక్షి, హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెబితే ఎవరూ ఒప్పుకోరని మాజీమంత్రి కె.జానారెడ్డి అన్నారు. అందరూ తనను లాక్కొచ్చి సీఎం రేసులో నిలబెడతారని, ఈ విషయాన్ని మనం కూడా ఒప్పుకోక తప్పదని చెప్పారు. అయితే ‘రేసుగుర్రం’ ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. ఆదివారం తన నివాసంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతుందని జోస్యం చెప్పారు. అత్యధిక స్థానాలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, దీంతోపాటు తెలంగాణలో తమ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎన్నికల్లో అంతటా ప్రచారం చేయలేదని, నియోజకవర్గాలకే పరిమితమయ్యారని అనడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగానని, తెలంగాణలో పార్టీకి ఇబ్బంది ఉన్నచోట అందరితో మాట్లాడి సమన్వయం చేశానని చెప్పారు. జానారెడ్డి కంటే అర్హుడెవరు..?: దామోదర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కీలకమైన నాయకుడిగా ఉన్న జానారెడ్డికంటే అర్హులైన వ్యక్తి ఎవరున్నారని ప్రశ్నించారు. ఆదివారం జానారెడ్డి నివాసానికి వచ్చిన దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘సీఎం పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడు. అన్ని శాఖలు నిర్వహించిన వ్యక్తి. పాలనలో అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను జిల్లా నేతగా చూడొద్దు. తెలంగాణలో ఆయనే పెద్ద లీడర్. తెలంగాణ నవ నిర్మాణంలో ఆయన పాత్ర అత్యంత కీలకం’’అని కొనియాడారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు రవీందర్రావు, మహేశ్వరరెడ్డి కూడా జానారెడ్డిని కలసి తెలంగాణలో పోలింగ్ సరళి, పార్టీ విజయావకాశాలపై చర్చించారు. -
తెలంగాణలో మెజారిటీ సీట్లు మావే
ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ధీమా ఇతరుల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలనలో విప్లవాత్మక మార్పులు {పైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొస్తాం హైదరాబాద్: తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుపరిపాలన, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారత, యువత ఉపాధి, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఆదివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మూడు తరాల ఎదురుచూపులు ఫలించాయి. తెలంగాణ అంతటా మేం పర్యటించి వచ్చాం. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి స్పందన కన్పిస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపమున్నప్పటికీ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సమర్థవంతంగా ముందుకు వెళుతున్నారు’’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి శంకర్రావుకు టికెట్ నిరాకరణలో తన పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాజు కొట్టిపారేశారు. ‘‘ఆయనకు టికెట్ రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. టికెట్ల కేటాయింపులో అసలు నా ప్రమేయం లేనేలేదు. నేను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిని కాదు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలోనూ లేను. నాపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు’’ అని చెప్పారు. జేఏసీ నాయకులు చేసిన సేవలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయం వల్లే ముగ్గురికి అవకాశం వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకొస్తే ప్రధానంగా ఐదు అంశాల్లో మౌలిక మార్పులు తీసుకొస్తామని తెలిపారు. 1.ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ విప్లవాత్మక చట్టాన్ని తెస్తాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చేస్తాం. అదే సమయంలో ఆయా సామాజిక వర్గాల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తాం. తద్వారా జిల్లాకో లక్ష ప్రైవేటు ఉద్యోగాలతో యువతకు ఉపాధి కల్పిస్తాం. 2.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కచ్చితంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతాం. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమిస్తాం. దీనికితోడు ఎప్పటికప్పుడు వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పారదర్శక పాలన సాగేలా చూస్తాం. 3. ప్రభుత్వ విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సమూలమైన మార్పులు చేసే విద్యా విధానాన్ని తీసుకొస్తాం. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్, వృత్తి విద్యా కళాశాలలను ఏర్పాటు చేస్తాం. 4. బీసీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ చట్టాన్ని తెస్తాం. పకడ్బందీగా అమలుచేసి ఆయా సామాజికవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం. 5.మహిళా సాధికారతను సాధించేందుకు స్వయం సహాయక సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఒక్కో సంఘానికి రూ.లక్ష గ్రాంట్ ఇవ్వడంతోపాటు విరివిగా బ్యాంకు రుణాలు అందేలా కృషి చేస్తాం.