తెలంగాణలో మెజారిటీ సీట్లు మావే
ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ధీమా
ఇతరుల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలనలో విప్లవాత్మక మార్పులు
{పైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొస్తాం
హైదరాబాద్: తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుపరిపాలన, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారత, యువత ఉపాధి, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఆదివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మూడు తరాల ఎదురుచూపులు ఫలించాయి. తెలంగాణ అంతటా మేం పర్యటించి వచ్చాం.
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి స్పందన కన్పిస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపమున్నప్పటికీ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సమర్థవంతంగా ముందుకు వెళుతున్నారు’’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి శంకర్రావుకు టికెట్ నిరాకరణలో తన పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాజు కొట్టిపారేశారు. ‘‘ఆయనకు టికెట్ రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. టికెట్ల కేటాయింపులో అసలు నా ప్రమేయం లేనేలేదు. నేను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిని కాదు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలోనూ లేను. నాపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు’’ అని చెప్పారు. జేఏసీ నాయకులు చేసిన సేవలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయం వల్లే ముగ్గురికి అవకాశం వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకొస్తే ప్రధానంగా ఐదు అంశాల్లో మౌలిక మార్పులు తీసుకొస్తామని తెలిపారు.
1.ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ విప్లవాత్మక చట్టాన్ని తెస్తాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చేస్తాం. అదే సమయంలో ఆయా సామాజిక వర్గాల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తాం. తద్వారా జిల్లాకో లక్ష ప్రైవేటు ఉద్యోగాలతో యువతకు ఉపాధి కల్పిస్తాం.
2.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కచ్చితంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతాం. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమిస్తాం. దీనికితోడు ఎప్పటికప్పుడు వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పారదర్శక పాలన సాగేలా చూస్తాం.
3. ప్రభుత్వ విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సమూలమైన మార్పులు చేసే విద్యా విధానాన్ని తీసుకొస్తాం. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్, వృత్తి విద్యా కళాశాలలను ఏర్పాటు చేస్తాం.
4. బీసీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ చట్టాన్ని తెస్తాం. పకడ్బందీగా అమలుచేసి ఆయా సామాజికవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం.
5.మహిళా సాధికారతను సాధించేందుకు స్వయం సహాయక సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఒక్కో సంఘానికి రూ.లక్ష గ్రాంట్ ఇవ్వడంతోపాటు విరివిగా బ్యాంకు రుణాలు అందేలా కృషి చేస్తాం.