సీఎం రేసులో లేనంటే ఒప్పుకోరు: జానారెడ్డి
- అతిపెద్ద పార్టీగా అవతరించేది కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెబితే ఎవరూ ఒప్పుకోరని మాజీమంత్రి కె.జానారెడ్డి అన్నారు. అందరూ తనను లాక్కొచ్చి సీఎం రేసులో నిలబెడతారని, ఈ విషయాన్ని మనం కూడా ఒప్పుకోక తప్పదని చెప్పారు. అయితే ‘రేసుగుర్రం’ ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.
ఆదివారం తన నివాసంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతుందని జోస్యం చెప్పారు. అత్యధిక స్థానాలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, దీంతోపాటు తెలంగాణలో తమ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారని అభిప్రాయపడ్డారు.
టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎన్నికల్లో అంతటా ప్రచారం చేయలేదని, నియోజకవర్గాలకే పరిమితమయ్యారని అనడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగానని, తెలంగాణలో పార్టీకి ఇబ్బంది ఉన్నచోట అందరితో మాట్లాడి సమన్వయం చేశానని చెప్పారు.
జానారెడ్డి కంటే అర్హుడెవరు..?: దామోదర్‌రెడ్డి
ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కీలకమైన నాయకుడిగా ఉన్న జానారెడ్డికంటే అర్హులైన వ్యక్తి ఎవరున్నారని ప్రశ్నించారు. ఆదివారం జానారెడ్డి నివాసానికి వచ్చిన దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘సీఎం పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడు. అన్ని శాఖలు నిర్వహించిన వ్యక్తి.
పాలనలో అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను జిల్లా నేతగా చూడొద్దు. తెలంగాణలో ఆయనే పెద్ద లీడర్. తెలంగాణ నవ నిర్మాణంలో ఆయన పాత్ర అత్యంత కీలకం’’అని కొనియాడారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు రవీందర్‌రావు, మహేశ్వరరెడ్డి కూడా జానారెడ్డిని కలసి తెలంగాణలో పోలింగ్ సరళి, పార్టీ విజయావకాశాలపై చర్చించారు.