కిషన్ సార్.. గిదేంది? | District margin of error on the website | Sakshi
Sakshi News home page

కిషన్ సార్.. గిదేంది?

Published Wed, Jun 11 2014 5:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కిషన్ సార్.. గిదేంది? - Sakshi

కిషన్ సార్.. గిదేంది?

జిల్లా వెబ్‌సైట్‌లో తప్పులు
- ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు
- పొన్నాల, సారయ్య ఇంకా మంత్రులే..
- కనిపించని కొత్త ఎమ్మెల్యేల ముఖాలు
- జిల్లాలో 669 ఎంపీటీసీ స్థానాలేనట..
- కనిపించని తెలంగాణ సర్కారు అంశం

జిల్లా ప్రజలకు ఓ మనవి. ‘దీని కోసం ఆఫీసు దాకా రావడమెం దుకు.. ఇంటర్నెట్‌లో చూసుకోండి’ అని చులకనగా మాట్లాడే కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారుల మాటలు నమ్మకండి. జిల్లా అధికారిక వెబ్‌సైట్ చూడకండి. ఎందుకంటారా.. అందులో ఉండే వివరాలకు.. వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం దాటినా... జిల్లా వెబ్‌సైట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారులోని వారే మంత్రులుగా ఉన్నారు. ప్రభుత్వ అధికారిక సమాచారం వెల్లడించే జిల్లా వెబ్‌సైట్‌లో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం విషయం అసలే లేదు.
 
సాక్షి ప్రతినిధి, వరంగల్ :సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కాకముందే కలెక్టర్ కిషన్ కలిసి వచ్చారు. జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ సహా కీలక అధికారులందరూ వెళ్లారు. అయితే రాజయ్య డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా గుర్తించడం లేదు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇలా చూడబోతే ఎన్నో వింతలు జిల్లా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. విదుల్లో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వాన్ని తెలియజేసేలా వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. కలెక్టర్ కిషన్ పర్యవేక్షణలో ఉండే అధికారిక వెబ్‌సైట్‌లోనే ఇలా ఉండడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో సర్కారు ఏర్పడింది. జిల్లాకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2నే సర్కారు కొలువుదీరింది. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఓరుగల్లు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని చేసిన జిల్లా అధికార యంత్రాంగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిందనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇదొక్కటే కాదు ఏవో ఒకటిరెండు అంశాల్లో తప్పితే ఏ సమాచారం కూడా ఈ వెబ్‌సైట్‌లో సరిగా లేదు.
 
వెబ్‌సైట్‌లో విచిత్రాలు ఇవీ..
- ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగానే ఉన్నారు. వీరు జనగామ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారట. గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్, మొలుగూరి బిక్షపతి, మాలోతు కవిత, దనసరి అనసూయ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యేలుగా, కొండా మురళీధర్‌రావు ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు.
- కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలు దగ్గరపడుతోంది. జిల్లా వెబ్‌సైట్‌లో మాత్రం వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఇంకా సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ ఎంపీగా బలరాంనాయక్, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నారు.
- జిల్లాలో ఇటీవలే 705 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులే ప్రకటించారు. వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం మాత్రం జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలు 669 మాత్రమే.
- గత ఏడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారంలో  మాత్రం జిల్లాలో 1,014 గ్రామపంచాయతీలు ఉన్నట్లుగా ఉంది.
- ఇటీవలే జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలకు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం జిల్లాలో రెండు మాత్రమే పురపాలక సంఘాలు ఉన్నాయి.
- 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి ఏడాది దాటుతున్నా జిల్లా వెబ్‌సైట్‌లో 2001 గణాంకాలే ఉన్నాయి. వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం మన జిల్లా జనాభా 32.46 లక్షలు ఉంది.
- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్‌సైట్‌లో ఉంది.  2012, 2014లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement