సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆద్యంతం రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సాగింది. ఎర్రకోట బురుజుల నుంచి దాదాపు 80 నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని గత నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ 2014లో దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాననే సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. మోదీ ముఖ్యంగా మరుగుదొడ్డ నిర్మాణం, ఎల్‌పీజీ కవరేజ్, విద్యుదీకరణ, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ల వంటి రంగాల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అసాధారణ విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు. సాయుధ దళాలకు ఒన్ ర్యాంక్..ఒన్ పెన్షన్ అమలుతో పాటు రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయించడం, జీఎస్టీ, బ్యాంకింగ్ సంస్కరణలు, సర్జికల్ స్ర్టైక్స్ వంటి అంశాలనూ ప్రధాని ప్రస్తావించారు.
గతంలో సందిగ్ధంలో ఉన్న పలు నిర్ణయాలను తాము సాహసోపేతంగా చేపట్టామని వివరించే ప్రయత్నం చేశారు. భారత్ రెడ్‌టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు, రిఫామ్..పెర్‌ఫామ్..ట్రాన్స్‌ఫామ్‌కు మారిందని..ఇవన్నీ తమ ప్రభుత్వ ఘనతగా చాటుకున్నారు. 2022లో అంతరిక్షానికి భారతీయుడిని పంపుతామని 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల్లో తన నాయకత్వంపై కొత్త ఆశలు రేపారు.
ఇక సామాజిక రంగాల్లోనూ తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎస్‌సీ,ఎస్‌టీ చట్టాన్ని పటిష్టం చేయడంతో పాటు బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం కట్టుబడ్డామని చెబుతూ ట్రిపుల్ తలాఖ్ నిషేధాన్ని ఉదహరించారు.
మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ వారికి మరణ దండనల ఉదంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనకు తిరిగి పట్టం కట్టేలా ప్రజామోదం పొందే ప్రయత్నంగా మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సాగింది.
Comments
Please login to add a commentAdd a comment