
మహ్మద్ అజారుద్దీన్ (పాత ఫొటో)
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ అజారుద్దీన్ మనసులో మాటను బయటపెట్టారు. 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన అజారుద్దీన్ గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్-సవాయ్ మాధోపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఈ సారి మాత్రం తన సొంత రాష్ట్రమైన తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఉందని చెప్పారు. అయితే, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలా? లేదా? అన్నది ఉంటుందని స్పష్టం చేశారు.
తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. రైతులు, మిగతావారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు వివరించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ నుంచి విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, గెలుపు లేదా ఓటమి గురించి తాను ఆలోచించడం లేదని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, టీ కాంగ్రెస్ పార్టీ నేతలు అజహార్‌ను 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎంపీ స్థానానికి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని గతేడాది కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment