సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో పొలిటికల్ ఫీవర్ తారస్థాయికి చేరుకుంది. గత నెల 11వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌కు సుదీర్ఘ సమయం ఉండడంతో ఒకరిద్దరు మినహా మిగతా అభ్యర్థులు అందరూ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంగళవారమే జిల్లాకు చేరుకున్నారు. కౌంటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ప్రధాన పార్టీల రాజకీయ నేతల సందడి పెరిగింది. హోటళ్లు అన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి.
గెలుపుపై అభ్యర్థుల ధీమా
సార్వత్రిక ఎన్నికల్లో విజేతలు ఎవరు.. పరాజితులు ఎవరు.. ఎవరెవరికి ఎంత మెజారిటీ వస్తుంది.. బాగా మెజారిటీ వచ్చే మండలాలు.. మెజారిటీ తగ్గే మండలాలు.. యువత, మహిళలు, రైతులు ఎవరికి పట్టం కట్టారు.. ఇలాంటి అనేక ప్రశ్నలకు 23వ తేదీ ఉదయం 11 గంటల కల్లా పూర్తి సృష్టత రానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం స్వీయ అంచనాలు వేసుకొని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19న చివరి దశ పోలింగ్ ప్రకియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో పార్టీ క్యాడర్‌లో విశ్వాసం రెట్టించినట్లయింది. నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారు.
చకచకా ఏర్పాట్లు
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో, అలాగే తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టర్ రెండు రోజులుగా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించి, రెండు స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఇక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఒక్కొక్క రాజకీయపార్టీకి 14 చొప్పున కౌంటింగ్ ఏజెంట్ పాస్‌లను జారీ చేస్తున్నారు. దాదాపు ఈప్రక్రియ కూడా 90 శాతం పూర్తయింది.
బరిలో 132 మంది అభ్యర్థులు
జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటీ చేశారు. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 107 మంది పోటీ చేశారు. ఇక నెల్లూరు పార్లమెంట్ నుంచి ప్రధాన రాజకీయపార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతోపాటు వామపక్షాలు, జనసేన ఉమ్మడి అభ్యర్థి, ఇండిపెండెంట్లు మొత్తం కలుపుకొని 13 మంది బరిలో నిలిచారు. అలాగే తిరుపతి పార్లమెంట్ నుంచి 12 మంది బరిలో నిలిచారు. గత నెల 11న జరిగిన సార్వత్రిక పోలింగ్‌లో 23.92 లక్షల మంది ఓటర్లకు గానూ 18.34 లక్షల మంది తమ ఓటు హక్కును జిల్లాలో వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 76.67 శాతం పోలింగ్ నమోదయింది. సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని మరి కొంత శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ పర్యాయం వీవీ ప్యాట్ లెక్కింపు కారణంగా ఫలితాల అధికారిక ప్రకటన రాత్రి 9 గంటలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధమయ్యాయి.
హోటళ్లు హౌస్‌ఫుల్
విదేశీ పర్యటనలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు దాదాపు అందరూ జిల్లాకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి అభ్యర్థులు అందరూ నెల్లూరు నగరంలోనే మకాం వేయనున్నారు. మరోవైపు 23వ తేదీన జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నెల్లూరు నగరంలోనూ, నగర శివారుల్లోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని నెల్లూరు సిటీ, రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలు, వారి అనుచరగణం ఇప్పటికే నగరంలో మకాం వేశారు. దీంతో నగరంలో హోటళ్లు నిండిపోయాయి. సర్వీసు అపార్ట్‌మెంట్లు, గౌస్ట్‌హౌస్‌లు కూడా పూర్తి బిజీగా మారిపోయాయి.
24 గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
Published Wed, May 22 2019 10:09 AM | Last Updated on Wed, May 22 2019 10:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment