
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న మోత్కుపల్లి
హైదరాబాద్: ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుంటానంటూ సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల్ని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడని, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు పెద్ద కొడుకెలా అవుతాడని, పెద్ద తాతవుతాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. అణగారినవర్గాల ప్రజలకోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంపార్టీని దొడ్డిదారిన హస్తగతం చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన సమయంలో చంద్రబాబు లేడని, కనీసం పార్టీ సభ్యుడు కూడా కాదని, పార్టీ జెండా మోయకుండానే అదే పార్టీని అడ్డం పెట్టుకుని అధికారం అనుభవిస్తున్నాడని దుయ్యబట్టారు. కాళ్లు మొక్కి గాంధీని చంపిన గాడ్సే కంటే నీతి మాలిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
నాలుగున్నరేళ్లు మోదీతో అంటకాగి, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని లేఖ కూడా ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదాకోసం తానే పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటని, 30 ఏళ్ల రాజకీయ అనుభవమున్న దళితనేతగా తాను చెబుతున్నానని, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమై జగన్‌ను గెలిపించి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. లక్షల కోట్లు సంపాదించుకున్న దొరకని దొంగ చంద్రబాబు అని, ఆయన నిజాయతీపరుడైతే 29 కేసుల్లో విచారణపై స్టే ఎందుకు తెచ్చుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ నుంచి పోవడంతో తెలంగాణకు శని పోయిందని, ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును ఓడించి శని వదిలించుకోవాలన్నారు.
అధికారం చేజిక్కించుకోవడానికి ఎటువంటి పనులకైనా వెనకాడని దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు ఓటమి కోసం 3700 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారికి దండం పెట్టుకున్నానని, ఏప్రిల్‌లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్నానని, అమ్మవారి చేతిలోని ఖడ్గంతో ఈ రాక్షసుడికి రాజకీయ సమాధి కట్టాలని వేడుకుంటానన్నారు. చంద్రబాబు ఓడిపోవడమే ఎన్టీఆర్ ఆశయమని, ఆ ఆశయం కోసమే బతుకుతున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment