
మాట్లాడుతున్నఎంపీ కవిత
బోధన్‌రూరల్(బోధన్): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పర్కిరించకుండా తెలంగాణకు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం ఏమిటని నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా పాలకుల పెత్తనం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఆమె ఆదివారం బోధన్ మండలంలోని అమ్దాపూర్, సంగం, కల్దుర్కి, జాడీజమాల్‌పూర్, సాలంపాడ్, సాలూర, హున్స, ఖజాపూర్, మందర్న, సాలూర క్యాంప్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ళల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి..
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్నివర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమైందని కవిత చెప్పారు. గత ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని పట్టించుకోలేదని, కానీ, టీఆర్‌ఎస్ సర్కారు రైతుల కోసం 24 గంటల కరెంట్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచామన్నారు. మహిళా సంక్షేమం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు తీసుకొచ్చామని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యమైందని, ఈసారి అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామని, స్థలాలు ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు అర్థిక సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని కవిత పేర్కొన్నారు. చెరుకు రైతులకు రవాణా చార్జీలతో పాటు అదనంగా ధర చెల్లించామని, శనిగ పంటను సర్కారే కొని గిట్టుబాటు ధర కల్పించిందని చెప్పారు.
కూటమికి బుద్ధి చెప్పాలి..
రైతుల అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీ ఇప్పుడు మహాకూటమి పేరుతో రూ.2 లక్షల రుణమాఫీ అంటు మభ్యపెట్టాలని చూ స్తున్నారని ఎంపీ విమర్శించారు. చంద్రబా బును వెనకెసుకొని వస్తున్న కాంగ్రెస్‌కు ప్రజ లు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. టిఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ నాయకత్వం ను బలపరచాలని ఆమె కోరారు. డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ సుమనారెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు మోహన్‌రెడ్డి, గిర్ధావర్ గంగారెడ్డి, సంజీవ్, షకీల్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర పాలకుల పెత్తనం అవసరమా?
ఎడపల్లి: తెలంగాణలో ఆంధ్ర పాలకుల పెత్తనం అవసరమా అని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఆదివారం కుర్నాపల్లి, ఎడపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసుకున్నామని చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు నీళ్లు రానిస్తాడా? అని ప్రశ్నించారు.
నేతలు ఉప్పు సంతోష్, మోహన్‌రెడ్డి, శ్రీరాం, ఎంపీపీ రజిత, రవీందర్‌గౌడ్, జక్కుపోశెట్టి, శ్రీనివాస్, ఇర్ఫాన్, మల్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment