
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ఆయన్ను తెలంగాణ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తన ప్రసంగంలో మన్యం వీరుడు కుమ్రంభీంను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారని, కానీ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఆయన పేరు పెట్టిందన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రజల మధ్య లేని కాంగ్రెస్ నేతలు రాసిచ్చే స్క్రిప్టును రాహుల్ గాంధీ చదవడంతో తెలంగాణ ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రాణహిత– చేవెళ్ల అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును తాము మార్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన పేరుతో ఆ ప్రాజెక్టు అలాగే ఉందని దీనిపై అనుమానాలుంటే రాహుల్‌గాంధీ నేరుగా ఆదిలాబాద్ వెళ్లి చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు ప్రజల కోసం పనిచేయలేదని, ఇప్పుడు వారు తెలిసీ తెలియని స్క్రిప్టును రాహుల్‌కు రాసిచ్చారన్నారు. తమ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుందని, దీనితో 42 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధిపొందుతారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వాల్సింది, ధరలపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమన్నారు. నిరుద్యోగ భృతిపై లోతుగా కసరత్తు చేసి ప్రకటించామని, దీన్ని అమలు చేయబోతున్నామని వినోద్ చెప్పారు.