
కిర్లంపూడి: పాదయాత్ర చేయకుండా తనను ఎందుకు అడ్డుకుంటున్నారో ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా చెప్పి తీరాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం చంద్రబాబు ఎస్టేట్ కాదని, ఆయన ట్రస్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కేసులతో బెదిరింపులకు దిగడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే కార్యాచరణకు దిగాలని సవాల్ చేశారు.
2009లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారని, మరి ఈ మార్గదర్శకాలు ముఖ్యమంత్రికి వర్తించవా అని ప్రశ్నించారు. చట్టానికి మీరు అతీతులా అని నిలదీశారు. ‘టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి అందరికీ కలవొచ్చు, నేను మాత్రం పాదయాత్ర చేయకూడదా?, నాపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి మావాళ్లను కలవకూడదని శాసిస్తున్నారు. ఎందుకు నాపై ఈ వివక్ష’ అని అడిగారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.