సాక్షి, కిర్లంపూడి : ఎన్నో వర్గాలకు సంక్రాంతి కానుకగా తన పేరుతో దాన ధర్మాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... కాపుల కోసం చంద్రన్న బీసీ రిజర్వేషన్ తీసుకు రావాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. శనివారం ఆయన సీఎంకు సెటైరిక్‌గా ఓ బహిరంగ లేఖను రాశారు.
‘మాకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అమలు దిశగా అడుగు వేశారని విని సంతోష పడ్డాం. మీరిచ్చిన ఈ హామీ అధికారంలోకి వచ్చాక ఆలస్యం చేసినందువల్ల మేం విద్యా, ఉద్యోగ అవకాశాల్లో చాలా నష్టపోయాం. మళ్లీ ఇలా జరగకుండా బిల్లులో పొందుపరిచిన సదుపాయాలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆలస్యం చేసినా చిత్తశుద్ధితో రిజర్వేషన్ బిల్లు పెట్టారని భావించా. కానీ, మా పెద్దలు, మేధావులు, బిల్లును రాష్ట్రపతికి పంపించనవసరం లేదని మీరు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. బిల్లును కోల్ట్ స్టోరేజ్ లో పెట్టడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అపార అనుభవం ఉన్న మీరు ఇలా చేయరని నేను వారిని సముదాయిస్తున్నాను. మనల్ని కోల్డు స్టోరేజీలో పెడితే అదే కోల్డు స్టోరేజిలోకి వారు రావడం జరుగుతుందని చెప్పానని’ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
సలహాలు ఇచ్చే వేధావిని కాదు..
ముఖ్యమంత్రి అయిన మీకు సలహాలిచ్చేంత మేధావిని కాదన్న ముద్రగడ.. రిజర్వేషన్ ఫలాలు రాష్ట్రంలో అమలైన వెంటనే కేంద్రంలోని బీసీ కమిషన్‌కు పంపి, కేంద్ర సర్వీసుల్లో కూడా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్‌లో చేర్చాలని మేధావులు సలహాలిస్తున్నారని, ఈ దిశగా అడుగులు వేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సంక్రాంతి నాటికి సీఎం ఆదేశాలొస్తాయని ఎదురు చూస్తున్నామని ముద్రగడ తెలిపారు. తమకు నష్టం చేస్తే.. మీకు నష్టం చేయడానికి వెనుకాడమన్న సత్యాన్ని గ్రహించాలని లేఖ ద్వారా ముద్రగడ మరోసారి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment