
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం, దగా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి ఎంతో చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు అరకొర కేటాయింపులే చేసిందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి బడ్జెట్‌లో కూడా కేటాయింపులు చేయకుంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఓ పక్క ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకున్నా మరోపక్క, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అంసెబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు. పంటల సాగు తగ్గిపోయి రైతుల వలసలు పెరగిపోతుంటే వ్యవసాయ రంగం ఎక్కడ బాగుందని ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడ సాగించలేదని, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ఇక సాగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment