నల్లగొండలో..బిగ్‌ఫైట్‌ | Nalgonda Lok Sabha Elections Candidates In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండలో..బిగ్‌ఫైట్‌

Published Tue, Mar 26 2019 11:34 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Nalgonda Lok Sabha Elections Candidates In Nalgonda - Sakshi

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నర్సింహారెడ్డి

సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థికి... ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడికి మధ్య జరగనున్న పోరు ఆసక్తి గొల్పుతోంది. ఇంకోవైపు జిల్లా పార్లమెంట్‌ ఎన్నికల చరిత్రలో రెండోసారి సీపీఎం మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇప్పటిదాకా ఏ పార్టీ తమ తరఫున పోటీ చేయడానికి మహిళలకు అవకాశం ఇవ్వలేదు.

గతంలో మిర్యాలగూడ నియోజకవర్గంనుంచి సీపీఎం తన అభ్యర్థిగా సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మికి సీపీఎం టికెట్‌ ఇచ్చి పోటీలో పెట్టింది. బీజేపీ పోటీకి పెట్టిన గార్లపాటి జితేంద్రకుమార్‌ కూడా ఎన్నికల రాజకీయాలకు కొత్త వ్యక్తే కావడం గమనార్హం. మొత్తంగా నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నా రసవత్తర పోరు మాత్రం అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.



కాంగ్రెస్‌కు అత్యధిక విజయాల రికార్డు
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పార్లమెంట్‌ ఎన్నికల్లో కానీ అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డు కాంగ్రెస్‌ పేరిటే ఉంది. గత సార్వత్రిక (2014) ఎన్నికల్లో ఆ పార్టీ 1.93లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల చరిత్ర చూసినా.. అత్యధిక పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు, లేదంటే కమ్యూనిస్టులు మాత్రమే గెలిచారు

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌ తన విజయంపై చాలా ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని, దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టే ఓటింగ్‌ ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నల్లగొండ ఎంపీ స్థానంలో గెలుస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement