మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం.. ఆ పార్టీ అభ్యర్థి, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ సమక్షంలోనే రసాభాసగా మారింది. టీడీపీ నేత గంజి చిరంజీవిపై ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సమావేశంలో గంజి చిరంజీవి మాట్లాడుతుండగా.. నీటి సంఘాల అధ్యక్షుడు కోనంకి శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు నాయకులు ఒక్కడివే మాట్లాడతావా.. ఇప్పటికే నీవల్ల పార్టీ పరువు పోయిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేశావంటూ లోకేశ్ సామాజికవర్గానికి చెందిన నేతలు చిరంజీవిపై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న లోకేష్ ఏం మాట్లాడాలో తెలియక బిత్తర చూపులు చూస్తుండగా వేదికపైన ఉన్న నాయకులు కలుగజేసుకుని శాంతింపజేశారు. కావాలనే బీసీ వర్గానికి చెందిన చిరంజీవిని కొందరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని ఆయన వర్గం నేతలు వాపోయారు.
టీడీపీ గెలవంది 1989 నుంచే: లోకేశ్
1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని గురువారం తత్తరపాటుకు గురైన మంత్రి లోకేశ్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పొరపాటును సరిదిద్దుకుని.. 1989 నుంచి నియోజకవర్గంలో విజయం సాధించలేదన్నారు. రాజధాని ముఖ ద్వారం అయిన మంగళగిరిలో పోటీ చేయడం తన అదృష్టమన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చామని, అదే విధంగా మంగళగిరి చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment