సాక్షి, తిరుపతి: క్యాబినెట్ బెర్తులు శుక్రవారం ఖరారయ్యాయి. జిల్లా నుంచి సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామిని మంత్రి పదవులు వరిం చాయి. మంత్రివర్గ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యాన్ని పాటించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
పెద్దాయనను వరించిన మంత్రి పదవి
జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. 2009లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విశేష సేవలందించారు. అటవీశాఖతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఎట్టకేలకు చోటు దక్కించుకున్నారు. తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు.
నారాయణస్వామికి మంత్రి పదవి..
గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీర్వాదంతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తొలిసారి మంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment