నాయకులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
సాక్షి, వెదురుకుప్పం : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని, అది రూపుమాపాలంటే అధికారుల సహకారంతోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి వెల్లడించారు. మండల స్థాయిలో రెవెన్యూ, ఎంపీడీవో, పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు పారదర్శకంగా వ్యవహరించినప్పుడే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ హయాంలో అవినీతిలో కూరుకుపోయిన అధికారులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని, పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు నిబద్ధతతో సిద్ధంకావాలని సూచించారు. రాష్ట్రంలో 80 శాతం మంది అధికారులు ప్రభుత్వ పథకాల అమలులో ముందున్నారని, మిగిలిన 20 శాతం మంది అలసత్వం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పాలన లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేయాలని, అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉంటుందని చెప్పారు.
మండలంలోని దళితవాడల్లో నూతనంగా నిర్మించిన దేవాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని శనివారం పుత్తూరులో ఉపముఖ్యమంత్రిని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవోతో మాట్లాడి ఆలయాల అభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇనాంకొత్తూరు, బొమ్మన్‌దొడ్ల, నక్కలాంపల్లె, గుట్టమీద దళితవాడలో ఆలయాల అభివృద్ధికి సంబంధించి సిఫారసు లేఖలు టీటీడీకి, జేఈవోకు పంపనున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై జిల్లా స్థాయి అధికారులకు ఫోన్‌చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment