బళ్లారి సభలో నరేంద్ర మోదీ
సాక్షి బళ్లారి: కాంగ్రెస్ పాలనలో బ్రాండ్ కర్ణాటక పూర్తిగా దెబ్బతిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక విలువలతో కూడిన కర్ణాటకను కాంగ్రెస్ ఇప్పుడు చూపించగలదా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బళ్లారిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రజల ఉత్సాహంతో కాంగ్రెస్ చివరి కోట కూడా కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో బ్రాండ్ కర్ణాటక అనేది పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. విజయనగర రాజుల పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీ నాశం చేసిందంటూ మండిపడ్డారు.
సిద్దరామయ్య ప్రభుత్వం తీరుతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేటికీ కర్ణాటక ప్రజల్ని మోసం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాటకాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్.. దళితులు, ఓబీసీలకు శత్రువుగా మారిందన్నారు. అక్రమ మైనింగ్‌లతో ఎంతో దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాషాయ పార్టీకి ఓటేసి, బళ్లారి ప్రజలను ఎన్నో అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మోదీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment