ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మూడో విడత ప్రచారంలో భాగంగా కాంగ్రెస్.. బీజేపీ సహా మిగతా పార్టీలు పోటాపోటీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం తుమకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
‘తుమకూరు ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. అలాంటి ప్రాంతంలో నేడు ప్రజలు తాగునీటి కరువుతో అల్లల్లాడుతున్నారు. పక్కనే హేమవతి నది ప్రవహిస్తోంది. కానీ, ఇక్కడి ప్రజలకు తాగు నీటిని అందించటంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. 30 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. కానీ, ఈ నాలుగేళ్లలో మా హయాంలో ప్రాజెక్టులను నిర్మించి నీటి కష్టాలు తీర్చాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనం మీద ఉన్న ఆసక్తి అభివృద్ధి మీద లేదు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదు. బంగాళాదుంపలు-బంగారం అంటూ మాట్లాడిన వాళ్లు(కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) చేసిన వాళ్లు కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాటం హస్యాస్పదంగా ఉంది.
..ఇందిరా గాంధీ హయాం నుంచే పేదలను మోసం చేస్తూ వస్తున్నారు. గరీబ్ గరీబ్.. అంటూ వాళ్ల జీవన ప్రమాణాలను పెంచటంలో విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అడ్డగోలు హామీలిస్తున్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగివేసారి పోయారు. కాంగ్రెస్-జేడీఎస్‌లు తోడు దొంగలు. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయి. పైకి విమర్శలు గుప్పిస్తూనే లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయి. బెంగళూరులో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి జేడీఎస్ మద్ధతు ఇవ్వటమే అందుకు నిదర్శనం. ఈ మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీది ఓటు బ్యాంకు రాజకీయాలు. మేం అవినీతి, నల్లధనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కర్ణాటక అభివృద్ధి కేవలం బీజేపీ వల్లే సాధ్యం. రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీకి ఓట్లేసి గెలిపించండి’ అని ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment