బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్‌! | Netizens Setires On Nandamuri Balakrishna | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 18 2018 11:22 AM | Last Updated on Sun, Nov 18 2018 11:39 AM

Netizens Setires On Nandamuri Balakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో వార్తల్లో నిలిచారు. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చిన టీడీపీ బాస్‌ చంద్రబాబు.. కూకట్‌పల్లి స్థానాన్ని దివంగత నేత హరికృష్ణ కూతురు సహాసినికి కేటాయించారు. ఇంకేముంది బావ చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన బాలయ్య.. తన అన్న కూతురు గెలుపునకు నడుం బిగించారు. ఇందులో భాగంగా శనివారం ఆమె నామినేషన్‌ వేసేముందు తాత, తండ్రి సమాధుల వద్ద నివాళులర్పించి అక్కడే నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య నోట జాలువారిన మాట.. ‘ఆయన(హరికృష్ణ) అకాల మరణం అందరిని కూడా సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తింది’. ఇంకేముంది ఈ మాటలతో బాలయ్య అడ్డంగా బుక్కయ్యారు. నెటిజన్లు సెటైర్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఎయ్‌ మళ్లి ఏసేశాడు.. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటి నాయనా’ అని ఒకరు.. కనీసం ఆ పదం కూడా సరిగ్గా పలకకుండా సంబర ఆశ్చర్యం అని పలకడం ఏంటని ఇంకొకరు కామెంట్‌ చేస్తున్నారు. తెలుగు భాషను ఖూనీ చేయడంతో అల్లుడు లోకేశ్‌ను మించిపోయిండుపో అని ఇంకొకరు సెటైర్‌ వేస్తున్నారు.  ఇక ఈ సందర్భంగానే మహాకూటమి తరపున బరిలోకి దిగుతున్న సుహాసినికి మీడియా ముందే కూటమి గురించి అడిగితే ఇలా చెప్పాలని సూచించడంపై కూడా జోకులు పేలుతున్నాయి. గతంలో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో మాట్లాడి విమర్శలపాలైన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement