
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణలో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి తప్పనిసరి కానుంది. తాగునీటి ఎద్దడి ఏర్పడినా, వ్యవసాయ సీజన్, ప్రధాన పండుగలు, ఉత్స వాలు, విద్యార్థులకు పరీక్షల సమయం వంటి రానున్నా ఈ ఎన్నికలను వాయిదా వేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి దక్కనుంది. సర్కారు సమ్మతితోనే రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండనుంది.
ప్రత్యేక నిబంధన ద్వారా..: గత నెల 30న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పురపాలికల చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సమ్మతి తప్పనిసరనే నిబంధనను ఈ బిల్లు ద్వారా చట్టాల్లో కొత్తగా చేర్చింది. పురపాలికలకు సాధారణ ఎన్నికల నిర్వహణ, ఏదైనా పురపాలికల పాలకవర్గాల పదవీకాలం ముగిస్తే ఏర్పడే ఖాళీలను భర్తీకీ తప్పనిసరిగా 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సమ్మతిని తప్పనిసరి చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలకు కత్తెర పడినట్లయింది.
ఎన్నికలను వాయిదా వేసే వెసులుబాటు..
‘‘రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికలతో పాటు సాధారణంగా ఏర్పడే ఖాళీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్ని కలు జరపాలి. ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలిపే ముందు ప్రభుత్వం శాంతిభద్రతలు, పోలీసు సిబ్బంది లభ్యత, భద్రతా సిబ్బంది, హోంగార్డులు, కేంద్ర సాయుధ బలగాలు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది లభ్యత, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి లభ్యత, సమీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఇతర చట్టసభ స్థానాలకు ఎన్నికలు, ప్రకృతి విపత్తులు, వ్యవసాయ సీజన్ లాంటి సీజనల్ పరిస్థితులు, ప్రధాన పండుగలు, ఉత్సవాలు, విద్యార్థుల పరీక్షలు, అంటురోగాలు, జనాభా గణన, ఇతర గణాంకాల సేకరణ లాంటి ముఖ్యమైన సర్వేలు, ప్రజాప్రయోజనంతో కూడిన అంశాలు, ఇతర పరిపాలన అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి’’అనే సబ్ సెక్షన్‌ను ప్రభు త్వం జీహెచ్‌ఎంసీ చట్టం, రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, మున్సిపాలిటీల చట్టంలో కొత్తగా చేర్చింది. ఈ సబ్ సెక్షన్‌లోని ఏ కారణంతోనైనా ఎన్నికల నిర్వహణకు అనుమతి నిరాకరించే అధికారం ఈ చట్ట సవరణ ద్వారా ప్రభుత్వానికి లభించింది. ప్రభుత్వానికి అనుకూల వాతావరణం లేనప్పుడు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసుకునేందుకే మున్సిపల్ చట్టాల్లో ఈ కొత్త నిబంధనను పొందుపరిచినట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment