ఎ‘టాక్‌’! కొత్త గళాలు.. ప్రశ్నించే గొంతుకలు.. | New Voice in 2019 Elections | Sakshi
Sakshi News home page

ఎ‘టాక్‌’! కొత్త గళాలు.. ప్రశ్నించే గొంతుకలు..

Published Fri, Mar 15 2019 10:42 AM | Last Updated on Fri, Mar 15 2019 10:42 AM

New Voice in 2019 Elections - Sakshi

చైతన్యానికి నిదర్శనం ప్రశ్నించడమైతే.. అన్ని రకాల ప్రశ్నలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికి పుష్టినిస్తుంది! అందుకే.. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో.. అసమ్మతికి తావు, ప్రాధాన్యం ఎక్కువే ఉండాలి. అధికారంలో ఉన్న  వారిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలదైతే.. అది కాస్తా విఫలమైనప్పుడు పౌర సమాజం తన గొంతుకనివ్వాలి. ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలుగా భావించే వ్యవస్థలు రకరకాల కారణాలతో రాజీ పడిపోతున్నఈ తరుణంలో.. మేమున్నామంటూ కొందరు ముందుకొస్తున్నారు!. ప్రజాస్వామ్యమంటే.. నేతలు, ఎన్నికలు మాత్రమే కాదు.. అంశాలపై గళమెత్తడం కూడా అంటున్న వీరు వినిపిస్తున్న కొత్త గళాలివిగో...

 ఓటరే అసలు దేవుడు:  ప్రకాశ్‌రాజ్‌
ఒక్క సంఘటన మన జీవిత గమనాన్నిమార్చే స్తుందంటారు. ప్రకాశ్‌రాజ్‌ విషయంలోజరిగింది అచ్చంగా ఇదే. నటుడిగా ఐదారు భాషల్లోనటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితురాలు.. అదీ తన గురువుగాభావించి పూజించిన లంకేశ్‌ కూతురు గౌరి.. ఇంటి ముందే దారుణమైన హత్యకు గురికావడంప్రకాశ్‌ను దేశంలోనే శక్తిమంతుడైన వ్యక్తిని కూడా ఢీకొనేలా చేసింది. జస్ట్‌ ఆస్కింగ్‌ పేరుతో ప్రకాశ్‌రాజ్‌ వేసిన ప్రశ్నలు చాలా మౌలికమైనవి. కర్రుకాల్చివాతపెట్టడమెలాగో బాగా తెలిసిన ప్రకాశ్‌రాజ్‌రాజకీయాలు కులం, మతం, ప్రాంతాల ఆధారంగా కాకుండా సామాన్యుడి అవసరాలు, బాగు చుట్టూజరగాలని కోరుకుంటారు. ప్రకాశ్‌ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ బరిలోకీ దిగేశారు. బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌ ఇప్పటికే
సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుస్తూప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్లమెంటు సభ్యుడంటే ఢిల్లీలో కూర్చుని రాజకీయం మాత్రమే చేయడం కాదంటున్న ఈ నటుడుమురికివాడల్లోని అతి సామాన్యుల కష్టాలకూ స్పందించాలని అంటున్నారు. రామమందిర రాజకీయాలకు కాకుండా సామాన్య రైతుల కష్టాలను తీర్చడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్న ప్రకాశ్‌ఎన్నికల్లో ఏమాత్రం విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే!!

దళిత హక్కుల గళం:  జిగ్నేశ్‌ మెవానీ
ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించగల ముఖ్యమంత్రులున్న ఈ దేశంలో దళితుడిగా పుట్టిన ప్రతివాడికీ విచక్షణ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసని కుండబద్దలు కొట్టగలిగే జిగ్నేశ్‌ మెవానీ కూడా ఉన్నాడు! చర్మకారుడిగా తాత అనుభవాలు కదలించాయో.. పొట్టకూటి కోసం అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలో అన్ని రకాల పనులూ చేసిన తండ్రి కష్టాలు ఆలోచనలు రేకెత్తించాయో తెలియదుగానీ.. ముంబైలో కొంతకాలం విలేకరిగానూ పనిచేసిన జిగ్నేశ్‌ ఆ తరువాతి కాలంలో న్యాయవాదిగా దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించాడు. గుజరాత్‌లోని ఊనాలో దళితులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసించిన జిగ్నేశ్‌ అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్యమించాడు. కమ్యూనిస్టు నేత ముకుల్‌ సిన్హా, గాంధేయ వాది చున్నీభాయ్‌ వేద్‌ వద్ద ఉద్యమ పాఠాలు నేర్చుకున్న జిగ్నేశ్‌ 2016 నాటి ‘‘దళిత్‌ అస్మిత్‌ యాత్ర’’తో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశంలో దళితులపై వివక్ష పోవాలన్నా, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలన్నా కార్పొరేట్‌ సంస్థలకు బదులు దళితులకు భూమి పంపిణీ జరగాలని అంటున్నారు. ఇందుకోసం వ్యవస్థాగత మార్పులూ తప్పనిసరి అన్నది జిగ్నేశ్‌ వాదన. దళిత్‌ అస్మిత యాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో జిగ్నేశ్‌ గుజరాత్‌లోని వడ్‌గామ్‌ నుంచి అసెంబ్లీ బరిలో దిగి విజయం సాధించారు. తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా దళితులను తమ హక్కుల సాధనకు ఉద్యమించేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌లో ఘర్షణలకు కారణమయ్యాడని పోలీసులు కేసులు పెట్టినా.. అతడి ప్రమేయమేమీ లేదని కోర్టు ఆ కేసును కొట్టేసింది.

రోడ్డెక్కిన పాటీదార్‌:  హార్దిక్‌ పటేల్‌
రెండేళ్ల క్రితం జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు ఆధిక్యంతో ఇంకోసారి పగ్గాలు చేపట్టింది. దేశం మొత్తం మోదీ గాలులు వీస్తున్న 2017లో గుజరాత్‌లో బీజేపీని నిలువరించిన యువనేతగా హార్దిక్‌ పటేల్‌ను వర్ణిస్తారు విశ్లేషకులు. పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌ ఆలోచనలు ఇతరుల కంటే చాలా భిన్నం. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు ఈయన. మంచి మార్కులు సంపాదించుకున్నా తన చెల్లికి స్కాలర్‌షిప్‌ రాకపోవడం.. తక్కువ మార్కులతోనే ఓబీసీల్లోని చెల్లి స్నేహితురాలికి దక్కడం.. యువ హార్దిక్‌ పటేల్‌కు ఏమాత్రం నచ్చలేదు. రిజర్వేషన్లు కొందరికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఆందోళన చేపట్టిన హార్దిక్‌.. ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని.. అలా కుదరని పక్షంలో అందరికీ ప్రత్యేక కోటాలు తీసేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం వేలమంది యువకులతో నిర్వహించిన పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఓబీసీ వర్గపు నేత అల్బేశ్‌ ఠాకూర్, దళిత ఉద్యమ నేత జిగ్నేశ్‌ మెవానీతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్న హార్దిక్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.  

రాజ్యాంగంపై ఒట్టేసి..:  కన్హయ్య కుమార్‌
మూడేళ్ల క్రితం జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దేశమంతా పరిచయమైన వ్యక్తి. పీహెచ్‌డీ విద్యార్థులకిచ్చే భృతిని తగ్గించడంపై ఢిల్లీ వీధులకెక్కిన కన్హయ్య కుమార్‌ తరువాతి కాలంలో దేశద్రోహం కేసులు ఎదుర్కోవడం.. అరెస్ట్‌ కావడం ఇటీవలి పరిణామాలే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బెయిల్‌పై విడుదలయ్యాక జేఎన్‌యూలో తోటి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం.. చతురోక్తులు, మాట విరుపులతో మోదీ, అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎక్కుపెట్టిన విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. కన్హయ్య కుమార్‌ నమ్మేది.. ప్రచారం చేసేది.. రాజకీయ నేతలు అనుసరించాలని కోరుకుంటున్నదీ ఒక్కటే. భారత ప్రజలందరి కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని తు.చ. అమలు చేయమని! ఎన్నికల సమయంలో చేసిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ ప్రశ్నించాలన్నది అతని సిద్ధాంతం. బిహార్‌లోని బేగూసరాయిలోని భూమిహార్‌ కుటుంబం నుంచి వచ్చారీయన. జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేసే సమయానికి ఆయన ఆలోచన తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్‌ దళితులకు కల్పించిన రక్షణను, వామపక్ష సిద్ధాంతాలను కలిపి కన్హయ్య కుమార్‌ ప్రతిపాదిస్తున్న ‘‘లాల్‌.. నీల్‌’’ నినాదాన్ని ఇప్పుడు వామపక్ష పార్టీలు ప్రచారం చేస్తూండటం గమనార్హం. 2019 ఎన్నికల బరిలోనూ నిలుస్తున్న ఈ యువనేత భారత రాజకీయ వ్యవస్థలో సరికొత్త, ప్రస్ఫుటమైన గళమవుతారనడంలో సందేహం లేదు.

గిరిజనుల మరో గొంతుక:  సోనీ సూరి
బస్తర్‌ జిల్లాలో ఒకప్పుడు ఓ సామాన్య ఉపాధ్యాయురాలి పేరు సోనీ సూరి! మరి ఇప్పుడు..? దాదాపు 17 రాష్ట్రాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ధీర వనిత. ఒకపక్క నక్సలైట్లు.. ఇంకోవైపు వారిని వెంటాడుతూండే పోలీసుల మధ్య నలిగిపోతూ మాన ప్రాణాలను కోల్పోతున్న గిరిజనులకు అండగా నిలవడం ఈమె వృత్తి, ప్రవృత్తి కూడా. తమతో కలిసిపోవాల్సిందిగా మావోయిస్టులు కోరినప్పుడు.. తమకు ఇన్ఫార్మర్‌గా పనిచేయాలని పోలీసులు ఆదేశించినప్పుడూ సోని సూరి చెప్పిన మాట ఒక్కటే. ఇద్దరికీ సమాన దూరంలో ఉండటం తన విధానమని కుండబద్దలు కొట్టింది. అందుకు తన భర్తను పోగొట్టుకుంది. అత్యాచారాలకు గురైంది. ఎనిమిది పోలీసు కేసులు ఎదుర్కొంది. చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను పోలీసుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని.. అది తన హక్కులను కాలరాయడమేనని వాదించి విజేతగా నిలిచింది. ఆ తరువాతి కాలంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల బరిలోనూ నిలిచింది. సోనీ తండ్రిని మావోయిస్టులు కాల్చేస్తే.. సానుభూతి పరుడన్న నెపంతో పోలీసులు భర్తను ఎత్తుకెళ్లిపోయి.. హింసించిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినాసరే నమ్మిన సిద్ధాంతాల కోసం, గిరిజనుల హక్కుల కోసం సోనీ సూరి ఛత్తీస్‌గఢ్‌లో పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ఆమెపై యాసిడ్‌ దాడి కూడా జరిగింది.

కశ్మీర్‌ కి కలీ   షెహలా రషీద్‌ షోరా
కశ్మీర్‌ సమస్య పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగ్రవాదం మాత్రమే కావచ్చు. అయితే ఈ ఉగ్రవాదాన్ని అణచివేసే లక్ష్యంతో అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ దళాలు హద్దుమీరి ప్రవర్తిస్తుంటాయని.. మానవ హక్కులను తోసిరాజంటాయని చాలామంది చెబుతుంటారు. కశ్మీర్‌లోనే పుట్టి పెరిగి.. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎదిగిన షెహలా రషీద్‌.. కన్హయ్య కుమార్, ఉమర్‌ ఖాలిద్‌ అరెస్ట్‌కు నిరసనగా చేసిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. అంతకుముందు కూడా కశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితిపై.. ముఖ్యంగా మైనర్‌ విచారణ ఖైదీలకు మద్దతుగా గళమెత్తారు షెహలా రషీద్‌. పీహెచ్‌డీ విద్యార్థులకు ఇచ్చే భృతిని తగ్గించిన సందర్భంలో ‘‘ఆక్యుపై యూజీసీ’’ పేరిట షెహలా తదితరులు చేసిన ఉద్యమం అందరికీ తెలిసిందే. 2015లో జేఎన్‌యూ ఎన్నికల్లో ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ తరఫున బరిలో దిగిన షెహలా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. మంచి వక్తగా పేరొందిన ఈ కశ్మీరీ మహిళ వివాదాలకు కొత్తేమీ కాదు. ఒక ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో మహమ్మద్‌ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఆరోపణపై 2017లో షెహలాపై ఒక కేసు నమోదైంది. కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు సందర్భంగానూ షెహలా చేసిన పలు వ్యాఖ్యలు దుమారం రేపాయి.

పల్లె నాడి పట్టినోడు:  సాయినాథ్‌
‘‘పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల’’... పదిహేనేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన పాట. భారతీయ ఆత్మగా చెప్పుకునే పల్లెల్లోని కష్టాలకు ఈ పాట అద్దం పట్టింది. అయితే దశాబ్దాలుగా జర్నలిస్టుగా.. ఫొటో జర్నలిస్టుగా ఇదే పని చేస్తున్న పాలగుమ్మి సాయినాథ్‌ గురించి మాత్రం కొందరికే తెలుసు. కరువు, ఆకలి గురించి సాయినాథ్‌కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అని నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ లాంటి వాళ్లే చెబుతున్నారంటే ఈ వ్యక్తి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పీపుల్స్‌ ఆర్కై వ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (పరి) పేరుతో సాయినాథ్‌ నడుపుతున్న ఓ వెబ్‌సైట్‌ దేశంలో అన్నదాతకు జరుగుతున్న నష్టమేమిటన్నది భిన్నకోణాల్లో వివరిస్తుంది. రైతు ఆత్మహత్యలు.. అందుకు దారితీస్తున్న కారణాలను వివరిస్తూ వేర్వేరు సమావేశాల్లో సాయినాథ్‌ చేసిన ప్రసంగాలు అత్యంత ఆసక్తికరమైనవంటే అతిశయోక్తి కాదు. ‘‘సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కనీసం ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు ఉన్నన్ని అధికారాలు కూడా లేవు. కానిస్టేబుల్‌ అటో ఇటో తేల్చేస్తాడు. చట్టాలను తిరగరాసే శక్తిలేని సుప్రీంకోర్టు జడ్జీలు రెండువైపులా వాదనలను వినడం మాత్రమే చేయగలరు. కానిస్టేబుల్‌ మాత్రం తనదైన చట్టాన్ని సిద్ధం చేసుకోగలడు. ఏమైనా చేయగలడు’’ అంటారు సాయినాథ్‌. ప్రభుత్వ విధాన లోపాల కారణంగానే దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని విస్పష్టంగా ఎలుగెత్తే సాయినాథ్‌ కార్పొరేట్‌ సంస్థలు సిద్ధం చేసిన గ్యాట్, డబ్ల్యూటీవో చట్టాల దుష్ప్రభావాలను రైతులు అనుభవిస్తున్నారని అంటారు.

శ్రామిక బాంధవి:  సుధా భరద్వాజ్‌
పుట్టిందేమో అమెరికా. పదకొండేళ్ల ప్రాయంలోనే భారత్‌కు తిరిగొచ్చారు. 18 నిండేసరికి అమెరికన్‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఐఐటీ చదువుతూ.. కార్మికుల కష్టాలకు కదిలిపోయారు. న్యాయవాదిగానూ మారిపోయాడు. ఇదీ హక్కుల ఉద్యమకారిణి సుధా భరద్వాజ్‌ స్థూల పరిచయం. 30 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఛత్తీస్‌గఢ్‌ ముక్తిమోర్చా తరఫున పనిచేస్తున్నారు. భిలాయి ప్రాంతంలోని గనుల్లో కార్మికుల వేతనాలను దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులపై కేసులు కట్టి న్యాయం కోసం పోరాడారు. గత ఏడాది జూలైలో రిపబ్లిక్‌ టీవీలో సుధా భరద్వాజ్‌పై వెలువడిన కథనం ఒకటి ఆమె అరెస్ట్‌కు దారితీసింది. మావోయిస్టు నేత ప్రకాశ్‌కు సుధా భరద్వాజ్‌ ఒక లేఖ రాసినట్లు.. ‘‘కశ్మీర్‌ తరహా పరిస్థితిని సృష్టించాలని అందులో పేర్కొన్నట్లు ఆర్ణబ్‌ గోస్వామి ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన సుధా భరద్వాజ్‌.. భీమా కోరేగావ్‌ అల్లర్ల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టినందుకే తనపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారన్నది సుధ వాదన.

 దేశమంటే మనుషులోయ్‌:  ఖాలిద్‌
పార్లమెంటుపై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్‌ గురుపై జేఎన్‌యూలో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా వివాదాల్లోకి.. ప్రాచుర్యంలోకి వచ్చిన ఉమర్‌ ఖాలిద్‌ దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గట్టిగా నమ్ముతారు. కాలేజీ రోజుల్లో భిన్న సంస్కృతులు, వ్యక్తులతో భిన్నత్వానికి పరిచయమైన ఉమర్‌.. తరువాతి కాలంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సమాజంలో వేర్వేరు వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం మొదలుపెట్టారు. ఆర్థిక సరళీకరణల తరువాత దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతోందన్న ప్రచారం జరుగుతున్న దశలోనూ కొన్ని వర్గాల వారు పొట్టగడిపేందుకు పడుతున్న కష్టాలు తనను కలచివేశాయని. దేశభక్తి అంటే.. వీరి కోసం పోరాడడమే అని గట్టిగా విశ్వసించి అనుసరిస్తున్నారు ఉమర్‌. రాజ్యాంగం కులమతాలకు అతీతంగా పనిచేయాలని.. స్పష్టం చేస్తూండగా. చేసే పని ఆధారంగా, కులం, వర్గం, మతం ఆధారంగా సమాజం విడిపోయి ఉండటం కూడా నిష్టు్టర సత్యమని.. రాజకీయాలు ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలని.. అంతరాలను, అసమానతలను మరింత పెంచేలా ఉండకూడదన్నది ఉమర్‌ విస్పష్ట అభిప్రాయం. దేశాన్ని ముక్కలు చేసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్‌ ఖాలిద్‌ ప్రభుత్వాలు లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు మద్దతుగా నిలవరాదని అంటారు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన వారెన్‌ ఆండర్సన్‌ను అప్పటి అధికార పక్షం విమానంలో దేశం దాటిస్తే.. మోదీ ప్రభుత్వం నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులను దాటించేసిందని ఆరోపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement