సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో రమేష్ కుమార్ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో నిమ్మగడ్డ చర్చలు జరపడం రాజకీయ వర్గల్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. (నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు)
కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే చంద్రబాబు సహచరులతో రహస్యంగా సమావేశం కావడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు డైరెక్షన్‌లోనే వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ('నిమ్మగడ్డ'ను నియంత్రించండి)
Comments
Please login to add a commentAdd a comment