
సాక్షి, అమరావతి : రాజకీయ నాయకులతో రహస్య భేటీలు జరిపే ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్ వేదికగా ఈ భేటీపై స్పందించిన సజ్జల.. నిమ్మగడ్డ, టీడీపీ బంధంపై పలు విమర్శలు చేశారు. (చదవండి : హైదరాబాద్ స్టార్ హోటల్‌లో గూడుపుఠాణి!)
స్టార్ హోట్‌ల్‌లో రహస్య భేటీలో పాల్గొన్న ముగ్గురు చెప్తున సమాధానాలు.. తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆరో ఫ్లోర్ వరకూ లిఫ్ట్‌లో వెళ్లి అక్కడనుంచి 8వ ఫ్లోర్‌కు లిఫ్ట్ వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. సుజనా, కామినేనిలు బీజేపీ మనుషులని టీడీపీ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికే ఈ సమావేశం పెట్టుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తన భుజాల మీదకు ఎందుకు ఎత్తుకున్నారు అని సూటిగా ప్రశ్నించారు.
‘ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరించగలరు?. బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా?. స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా?. స్టార్ హోటల్‌లో జరిగిన రహస్య భేటీని కోర్టుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అసరం లేదంటారా’ అని సజ్జల ప్రశ్నించారు.
సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ @JaiTDP వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు? (2/3)
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) June 24, 2020