సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రహస్య సమావేశం బట్టబయలు కావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. నిమ్మగడ్డను ఉపయోగించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెర వెనుక వ్యవహారాలు నడిపిన నేపథ్యంలో తమ గుట్టు రట్టు అయిందని టీడీపీ అధినాయకత్వంలో ఆందోళన మొదలైంది. నిమ్మగడ్డ పూర్తిగా తమ అధినేత కనుసన్నల్లో పని చేశారని, ఆయన తరపున కోర్టు కేసులను కూడా టీడీపీ నేతలే నడిపిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలు ఈ రహస్య భేటీతో నిజమని నిర్ధారణ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినట్లే నిమ్మగడ్డతో అనైతిక సంబంధం నెరుపుతూ చిక్కామని టీడీపీ నేతలు వాపోతున్నారు.
బీజేపీలో ఉన్నా బాబు సన్నిహితులే..
సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నా వారిద్దరూ చంద్రబాబు సన్నిహితులనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డతో సమావేశం కావడం, అందులో తమ అగ్రనేత ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఖండించడానికి సైతం టీడీపీ నేతలు ముందుకు రావట్లేదు. ‘ఫేస్‌టైమ్’ ద్వారా టీడీపీ అగ్రనేత ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడి కావడంపై ఆ పార్టీలో కలకలం మొదలైంది. రహస్య సమావేశం దృశ్యాలు బయటకు రావడంతో నిమ్మగడ్డ వ్యవహారంలో తాము చేస్తున్న వాదన అబద్ధమని ప్రజలకు తెలిసిపోయిందని, తెర వెనుక జరిపిన రాజకీయం బెడిసికొట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ఆవేదన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
నోరు మెదపని నేతలు..
ఈ రహస్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా సాయంత్రం వరకూ టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు ఈసారి స్పందించేందుకు ముందుకురాలేదు. సాయంత్రానికి వ్యూహాత్మకంగా దళిత నేత వర్ల రామయ్యను రంగంలోకి దించి మాట్లాడించారు. మాజీ మంత్రులు, చంద్రబాబు కోటరీ వ్యక్తులు, అధికార ప్రతినిధులెవరూ ఈ అంశంపై స్పందించలేదు. కాగా, కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్‌ల్లో నిమ్మగడ్డ, సుజనా, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment