న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులను స్వస్థలాకు తరలించడంపై రాజకీయం చేయడం సరైనది కాదని ఆమె కాంగ్రెస్ నేతలకు హితవుపలికారు. వలస కూలీలను ఆదుకోవడానికి ప్రతిపక్షం తమతో కలిసిరావాలని కోరారు. ఆదివారం ‘స్వయం సమృద్ధి భారతం’ ఆఖరి విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించే సమయంలో ఆర్థిక మంత్రి ఈ విమర్శలు చేశారు. (చదవండి : రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు..)
వలస కార్మికులు ప్రతి ఒక్కరిని వారి స్వస్థలాకు చేర్చి, ఆహారం, నిత్యావసరాలు కల్పిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికి చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్లపై నడక మార్గాన్ని ఆశ్రయించడం చాలా బాధగా ఉందన్నారు. ఈ కష్ట సమయంలో వలస కార్మికులను ఆదుకునేందకు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వలస కార్మికులును స్వస్థలాలకు చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక రైళ్లను నడుపుతుందని చెప్పారు.
కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రోడ్లపై కూర్చొని వలస కార్మికులతో మాట్లాడటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాయకులు రోడ్లపై కూర్చొని మాట్లాడే బదులు.. వలస కార్మికులతో కలిసి నడుస్తూ వారి బ్యాగులను మోయాలని అన్నారు. మీడియా ముఖంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరించిన ఆర్థిక మంత్రి.. వలస కార్మికుల విషయంలో బాధ్యతయుతంగా మాట్లాడాలని అభ్యర్థించారు. వలస కార్మికుల విషయంలో బాధ్యతయుతంగా కలిసి పనిచేద్దామని సూచించారు. (చదవండి : మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment