ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పార్లమెంటరీ పక్ష నేతలను కోరుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు కూడా ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇదే తొలి అవిశ్వాస తీర్మానం కావడం గమనార్హం. వాస్తవానికి మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఏప్రిల్ 6న తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలను కుదిస్తారన్న వార్తల నేపథ్యంలో కార్యాచరణలో స్వల్ప మార్పులు జరిగాయి. ఐదు రోజులు ముందుగానే.. అంటే ఈ నెల 16వ తేదీన తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌తో చర్చించి, నిర్ణయం తీసుకున్నారు.
నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు అందజేశారు. ‘‘లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్ 17లో గల 198(బి) నిబంధన కింద నేను ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నాను. ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16 నాటి సభా కార్యకలాపాల సవరించిన జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను. తీర్మానం: ఈ సభ మంత్రి మండలిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది’’ అని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతునప్పటికీ సానుకూలంగా స్పందించనందున కేంద్రంపై మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. ఇప్పటికే నోటీసు ఇచ్చాం. దీనిని బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలి. ప్రత్యేక హోదాతోపాటు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ప్రధాన హామీలను సైతం కేంద్రం విస్మరించింది. అందువల్ల మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం’’ అని మేకపాటి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవండి
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను, ఎంపీలను, నేతలను కలిశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతూ ఆయా పార్టీల అధ్యక్షులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన మూడు పేజీల లేఖను అందజేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఏఐఏడీఎంకే నేత తంబిదురై, సీపీఎం నేత సీతారాం ఏచూరి, బీజేడీ పక్ష నేత భర్తృహరి మెహతాబ్, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్, టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి, టీడీపీ పక్ష నేత తోట నర్సింహం, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్‌సింగ్ మాన్ తదితరులను కలసి మద్దతు కోరారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్‌లో మాట్లాడారు. మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీపీఐ నేతలతో ఫోన్‌లో సంప్రదించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. తమ పార్టీ నాయకత్వంతో చర్చించి సమాచారం అందిస్తామని వారు చెప్పారని, అందరూ సానుకూలంగా స్పందించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. విభజన హామీలపై టీడీపీ సభ్యులు, ఇతర అంశాలపై టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
కనీస బాధ్యతగా టీడీపీ మద్దతివ్వాలి
అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్‌సీపీ స్పష్టీకరణ
కేంద్రంపై తాము ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి రాష్ట్రం నుంచి కనీస బాధ్యతగా టీడీపీ మద్దతు ఇస్తే, దేశంలోని ఇతర పార్టీలు కూడా ముందుకొస్తాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై గురువారం లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరిగే పరిస్థితి లేకపోవడంతో ముందుగా చెప్పినట్టు ఈ నెల 21న కాకుండా 16వ తేదీనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు చెప్పారు. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాక కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలన్నారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను లోక్‌సభలో వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు అందించామన్నారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతోపాటు చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరుతున్నామని లోక్‌సభ స్పీకర్‌కు స్పష్టం చేశామని పేర్కొన్నారు.
మా ధర్మాన్ని నిర్వర్తించాం..: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికి పెట్టుకొని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ధర్మాన్ని నిర్వర్తించామన్నారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ గురువారం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్టీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు విప్ జారీ చేశారు.
అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఇలా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మాన కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును స్పీకర్ పరిశీలించాక.. సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. స్పీకర్ సంతృప్తి చెందితే.. చర్చకు స్వీకరిస్తారు. నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. లేకుంటే తరువాతి రోజుకు ఆ సభ్యుడు మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment