ప్రత్యామ్నాయాలు చూపకనే ఇబ్బందులు
- నల్లధనం వెలికితీతకు వైఎస్సార్‌సీపీ మద్దతు
- నోట్ల రద్దుపై విపక్షాల భేటీలో పాల్గొన్న ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం సాయంత్రం పార్లమెంటులోని కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో జరిగిన ఏడు విపక్ష పార్టీల భేటీలో వైఎస్సార్‌సీపీ తరఫున మేకపాటి పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న అవస్థలు వెంటనే తొలగించాల్సిన అవసరముందని విపక్ష పార్టీలు అభిప్రాయపడినట్లు తెలిపారు.
‘నల్లధనం వెలికితీతకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని ఈ సమావేశంలో స్పష్టం చేశాం. ప్రభుత్వం ఉన్నపలంగా సామాన్యుడికి తెచ్చిన ఇబ్బందులపైన మాత్రమే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పాం. ఉన్న కరెన్సీలో 86 శాతం పెద్ద నోట్లే ఉన్నారుు. అకస్మాత్తుగా వాటిని రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిజాయితీగా సంపాదించుకున్నవాళ్లు కూడా డబ్బును మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తీర్చేలా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిన అవసరం ఉంది. ముందే తగిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. సామాన్యులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ విధానం..’ అని మేకపాటి స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాయే ప్రధాన ఎజెండా : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రధాన ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని మేకపాటి తెలిపారు. రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, చట్టంలో పొందుపరిచిన ఇతర హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనేదే పార్టీ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడతామన్నారు. హామీలు అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాన మంత్రి మీద ఉందని స్పష్టం చేశారు.