విలేకరులతో మాట్లాడుతోన్న వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం రాత్రి తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవిశ్వాసం కోరుతూ తాము గురువారమే నోటీసులు ఇవ్వడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. అందులో భాగంగా మద్దతు ఇస్తామని చెప్పిన టీడీపీ తరువాత మాట మార్చి, సభలో వారు కూడా మరో అవిశ్వాసం నోటీసు హడావుడిగా ఇచ్చారన్నారు. పది రోజులుగా పార్లమెంట్ బయట, లోపల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా అంశంపై ఎటువంటి పోరాటం కొనసాగిస్తుందీ అందరికీ అర్థమవుతుందన్నారు.
తాము ఐదుగురిమే పార్లమెంట్‌లో ఉన్నప్పటికీ 5 కోట్ల ఆంధ్రుల గొంతును వినిపించేందుకే కృషి చేశామన్నారు. అయితే వెల్‌లో కాంగ్రెస్ సహా అనేక పార్టీల నాయకులు ఉన్నా ఆర్థిక బిల్లును పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం... నేడు అవిశ్వాసానికి మాత్రం సభ సజావుగా జరిగే అవకాశం లేదంటూ అంగీకరించకపోవడం దారుణమైన చర్య అని, దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు సభలో అవిశ్వాసం సోమవారం ప్రవేశపెట్టాలని కోరుతూ ఇప్పటికే తాము అవిశ్వాసం లేఖను కూడా ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా పోటీ చేస్తూ ఐదేళ్లు కాదు..పది సంవత్సరాలు హోదా అన్న మూడు పార్టీలు నాలుగేళ్లుగా ఎందుకు మౌనం వహించాయో సమాధానం చెప్పాలన్నారు.
మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారు..
తాము ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసమని ప్రకటిస్తే అవిశ్వాసం ద్వారా ఏం సాధిస్తారని ఒకసారి, హోదాకన్నా ప్యాకేజీయే బెటరని ఒకసారి, హోదా ఏమైనా సంజీవనా అని ఒకసారి ఇలా రకరకాలుగా మాటలు మార్చుతున్న ముఖ్యమంత్రిని పరిశీలిస్తే మతిభ్రమించి మాట్లాడుతున్నారేమో అన్న అనుమానం కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బీజేపీపై ఎందుకు సీఎం ఒత్తిడి తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసుల కోసమో, బీజేపీతో పొత్తుకో ఆరాటపడేవారం అయితే తాము ఆ పార్టీపై ఎలా అవిశ్వాసం పెట్టగలమన్నారు. కేవలం తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలకు మరలా మభ్యపెట్టే మాటలు చెప్పేందుకే టీడీపీ కుట్రపన్నుతోందని విమర్శించారు.
మాకు ఎవరితోనూ పొత్తు లేదు..
రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న అవినీతిని వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పుస్తకం కూడా వేశామని ఎంపీ అన్నారు. పవన్ కళ్యాణ్ బహుశా ఆ పుస్తకంలోని అంశాలను ఏమైనా ప్రస్తావించి ఉంటారేమో అని చెప్పారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్‌తోగాని, ఇతర రాజకీయ పార్టీ లతోగాని తమకు ఎటువంటి పొత్తులేదన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తామంటారో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. ఓటుకు నోటు కేసు, పోలవరంలో అవినీతి, ఇసుక దోపిడీ, పట్టిసీమ, రాజధాని నిర్మాణం, ఇలా ఏ అంశం పరిశీలించినా రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడి అయిందని, అటువంటి వారు మా పార్టీపై నిందలు వేస్తే సహించమన్నారు.
తమకు కోర్టుల మీద విశ్వాసం ఉంది గనుకనే తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారని, కానీ చంద్రబాబులా స్టేలు తెచ్చుకోలేదన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బిజూ జనతాదళ్, ఆప్ పార్టీలు మద్దతు ఇచ్చాయని, సోమవారం జరిగే అవిశ్వాసానికి కూడా తాము మరలా మద్దతు కోరతామన్నారు. అయితే సభ సజావుగా లేదంటూ కారణాన్ని చూపి సభను నిలిపివేయాలని చూస్తే మాత్రం ముందస్తుగా రాజీనామా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
తమకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు కాదని...రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే అని మరో మారు స్పష్టం చేస్తున్నామన్నారు. తామేమీ చీకట్లో చిదంబరాన్ని కలవలేదని, అక్రమ పొత్తులు టీడీపీకి మాత్రమే సాధ్యమన్నారు. నాలుగేళ్ల తరువాత అయినా పవన్ కళ్యాణ్ నిజంగా హోదా కోసం పోరాడేందుకు ముందుకు వస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ క్రమంలోనే గతంలోనే హోదా కోసం ముందుకు వచ్చిన వామపక్షాలతో కలిసే పోరాటం రాష్ట్రంలో కొనసాగిస్తున్నామన్నారు.
కేవలం ఎన్‌డీఏ మిత్రపక్షంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోవడం వల్లే నేడు ఈ దుర్గతి పట్టిందని, చివరి బడ్జెట్‌లో సైతం రాష్ట్రానికి అన్యాయం జరగడం బాధాకరంగా భావించి తమ పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చుండూరి రవిబాబు, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment