సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ మరోమారు అవిశ్వాసతీర్మానం పెట్టనుంది. సోమవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవకు నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని కారణంగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం అనివార్యమైందని ఆ పార్టీ ఎంపీలు చెప్పారు.
150 మంది లేచి నిలబడ్డారు: వైవీ
కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభలో అనూహ్య మద్దతు లభించిందని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘‘స్పీకర్‌గారు అవిశ్వాస తీర్మానం నోటీసులను చదివినతర్వాత 150 మందిదాకా ఎంపీలు లేచి నిలబడ్డారు. అయితే అప్పటికే పోడియం దగ్గర కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సభ ఆర్డర్‌లో లేనికారణంగా చర్చను చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ చెప్పారు. గందరగోళ పరిస్థితుల్లోనే ఆర్థిక బిల్లులు ఆమోదించుకున్నారే, మరి అవిశ్వాసంపై చర్చను మాత్రం వాయిదా వేయడం ఎంతవరకు సబబు? స్పీకర్, కేంద్రం తీరును మేం నిరసిస్తున్నాం. నేడు స్పీకర్ ఇచ్చే విందును కూడా వైఎస్సార్‌సీపీ బహిష్కరిస్తున్నది. చర్చ జరిగే వరకూ నోటీసులు ఇస్తూనేఉంటాం..’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
అందుకే బాబును నమ్మొద్దు: మేకపాటి
‘‘హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీనే. ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికి అవసరాలమేరకు రంగులు మార్చడంలో చంద్రబాబును మించినవాళ్లు లేనేలేరు. మొన్నటిదాకా ప్యాకేజీ చాలన్నీ సీఎం.. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని గమనించి మళ్లీ హోదా కావాలంటూ యూటర్న్ తీసుకున్నారు. ఏ ఎండకు ఆ గొడుగుపట్టే వ్యక్తిగనుకే బాబును ఎవరూ నమ్మొద్దు’’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
ఎంపీల రాజీనామాలపై స్పందించాలి: విజయసాయిరెడ్డి
‘‘రాజకీయ, సామాజిక, ఆర్థిక నేరగాడైన చంద్రబాబు.. హోదా విషయంలో మొసలి కన్నారు పెడుతున్నాడు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపీల రాజీనామాలపై వెంటనే స్పందించాలి. రాష్ట్ర సమస్యలపై నేను ప్రధానిని కలిస్తే తప్పేముంది? తన సొంత కొడుకుని కూడా నమ్మని చంద్రబాబు తనలాగే అందరూ ఉంటారని అనుకుంటారు. అవినీతి సొమ్మును బాబు విదేశాలకు ఎలా తరలిస్తున్నాడో ప్రధానికి వివరించాను. మాపై నమోదైన కేసులు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు న్యాయస్థానాలనే తప్పుపట్టేలా మాట్లాడటం సరికాదు’’ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment