సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఎన్నికల గుర్తు విషయంలో చిక్కొచ్చి పడింది. టీడీపీతోపాటు జాతీయ పార్టీ గుర్తింపు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే. దీంతో ఈ ఎన్నికల్లో తమకు అదే గుర్తు కేటాయించాలని ఎస్పీ పట్టుబడుతోంది. గతంలోనూ ఎస్పీ దక్షిణాదిన పోటీ చేసింది. ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎస్పీ సైకిల్ గుర్తు మీదే పోటీ చేసింది. 2004లో ఉమ్మడిరాష్ట్రంలో మాజీ మంత్రి, సీనియర్‌కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా ఇదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు.
అప్పుడు ఈసీ అరుణకు కొబ్బరికాయ గుర్తు కేటాయించింది. ఉమ్మడి ఏపీలో పోటీ చేసినప్పుడు టీడీపీ అభ్యంతరం తెలపడంతో ఎస్పీ అభ్యర్థులు వేరే గుర్తుతో పోటీచేశారు. అయితే, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని ఎస్పీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నందున.. అక్కడ వారి గుర్తుపై తమకు అభ్యంతరం లేదని, తెలంగాణలో మాత్రం సైకిల్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఈసీని కోరుతోంది.
ఇక్కడ టీడీపీ 14 స్థానాల్లోనే పోటీ చేస్తోందని, తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి, సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. కాగా, గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినందున సైకిల్ గుర్తును ఎస్పీకి కేటాయించలేమని ఈసీ చెప్పింది. మరో గుర్తు ఎంచుకోవాలని సూచించింది. అయినప్పటికీ టీడీపీ పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగిలిన స్థానాల్లో సైకిల్ గుర్తుపై బరిలోకి దిగే విషయంపై ఎస్పీ న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. ఈ సింబల్ వార్ ముదిరితే.. అది కూటమిపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిబంధనల ప్రకారం వెసులుబాటు ఉంది
గుర్తు విషయంలో మేం స్పష్టతతో ఉన్నాం. నిబంధనల ప్రకారం.. మాకు మా గుర్తుపై పోటీ చేసే వెసులుబాటు ఉంది. ఒకే గుర్తు ఉన్న రెండు పార్టీలు ఒకే నియోజకవర్గంలో తలపడితే.. అప్పుడు ఎవరో ఒకరు వెనకడుగు వేయాలి. అందులో మాకు అభ్యంతరం లేదు. టీడీపీ పోటీ చేసే స్థానాలు కాకుండా.. మిగిలిన వాటిలో మాకు సైకిల్ గుర్తుతో పోటీ చేసే వీలు ఉంది. ఈ విషయంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నాం.
–ప్రొఫెసర్ సింహాద్రి,
ఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment