
డీఎంకే మహిళా విభాగం నేతగానే తాను ముందుకు సాగుతానని కరుణానిధి గారాల పట్టి కనిమొళి వ్యాఖ్యానించారు. మహిళా విభాగం కార్యదర్శిగా కొనసాగుతానని, డీఎంకేలో తనకు తగిన గౌరవం, బాధ్యతలు అప్పగించి ఉన్నారని వివరించారు. అంతకు మించి తాను ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదని స్పష్టంచేశారు. 2జీ కేసు సృష్టించిన వాళ్లు ఎందరో ప్రస్తుతం లాభపడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.
సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి లభించడంతో చెన్నై చేరుకున్న డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళికి ఆ పార్టీ వర్గాలు శనివారం చెన్నైలో బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి, ఎంపీ వ్యవహరిస్తున్న కనిమొళి ఆనందానికి ప్రస్తుతం అవధులే లేవు. చెన్నై ఆళ్వార్‌పేట సీఐటీ కాలనీలోని నివాసంలో రాత్రి కొన్ని పత్రిక, మీడియా చానళ్లతో కనిమొళి ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయతతో తనకు అభినందన తెలిపిన చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన టీటీవీ దినకరన్, కృష్ణప్రియలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
డీఎంకే నిర్వీర్యం లక్ష్యంగా..
డీఎంకేని నామ రూపాలు లేకుడా చేయడం లక్ష్యంగా సాగిన కుట్రలో భాగమే 2జీ అని వ్యాఖ్యానించారు. ఇది సృష్టించిన కేసు అని, దీన్ని పనిగట్టుకుని అతి పెద్ద కేసుగా తీర్చిదిద్దారని వివరించారు. తమిళనాట డీఎంకే అనేది లేకుండా చేయడం కోసం 2జీని ఆయుధంగా తమ మీద విసిరారని, అయితే, ఇది పటాపంచలు చేశామన్నారు. డీఎంకే తల ఎత్తుకుని నిలబడే స్థాయిలో ఈ కేసు తీర్పు వెలువడిందని వ్యాఖ్యానించారు. అప్పీలుకు వెళ్లినా ధైర్యంగా కేసును ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వచ్చిన తీర్పే సుప్రీం కోర్టులోనూ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆధారాలు లేవు
ఈ కేసులో తమను ఇరికించిన సీబీఐ ఆధారాల్ని సేకరించలేక చతికిలపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలంజర్ టీవీలో తాను కేవలం రెండు వారాలు మాత్రమే డైరెక్టర్‌గా వ్యవహరించినట్టు పేర్కొన్నారు. కలంజర్ టీవీ టెలికాస్టింగ్‌కు ముందే తాను ఆ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఇందుకు తగ్గ ఆధారాలు సీబీఐ వద్ద కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ టీవీలో తనవాట 20 శాతం మాత్రమేనని, రాజీనామా అనంతరం తానెప్పుడూ ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇందుకు తగ్గ ఆధారాలను సమర్పించడంతోనే కోర్టులో కేసులు నిలబడ లేదని పేర్కొన్నారు.
ఎదురుచూడలేదు
ఈ కేసును తాను ఎదురు చూడలేదన్నారు. ఇది తనకు రాజకీయంగా అనుభవాన్ని నేర్పినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో తానెప్పుడు నీరసించలేదని, ధైర్యంగానే ఎదుర్కొన్నాని తెలిపారు. అప్పీలుకు వెళ్లినా అదే స్థాయిలో ఎదుర్కొంటానని వ్యాఖ్యానించారు. అనేకమంది కలిసి కట్టుగా కుట్రపన్ని ఈ కేసును సృష్టించారని, ఇందులో ఉన్నవాళ్లు అనేకమంది ప్రస్తుతం లాభపడ్డ వారేనని వివరించారు. ఈ కేసును అతి పెద్దదిగా తీర్చిదిద్దడంలో కిరణ్ బేడీ కూడా ఒకరు అని, అయితే, ప్రస్తుతం ఆమె గవర్నర్ హోదాలో ఉండడం బట్టి చూస్తే, ఇలా లాభపడ్డ వారు చాంతాడు అంత అని తెలిపారు.
ఇక పార్టీమీదే దృష్టి
2జీ కేసును కాంగ్రెస్ వేయలేదని, ఇతరులు వేస్తే కోర్టు పర్యవేక్షణలో విచారణ సాగిందన్నారు. ఇన్నాళ్లు తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో ఇతర విషయాల మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇక, తన దృష్టి అంతా పార్టీ మీదేనని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కానున్నట్టు, ప్రజల్ని కలవబోతున్నట్టు తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ముందుకు సాగనున్నట్టు, మహిళా విభాగం కార్యదర్శిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీపరంగా ఏ పదవిని ఆశించడం లేదని ముగించారు.
ఆయన పరామర్శలో రాజకీయం లేదు
పార్లమెంట్‌లో గానీయండి, ఢిల్లీలో ఇతర సందర్భాల్లో గానీయండి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే కలిసినా, ఎదురుపడ్డా, కరుణానిధి గురించి, ఆయన ఆరోగ్యం గురించి మోదీ తప్పనిసరిగా అడిగేవారని వివరించారు. అందులో భాగంగానే చెన్నైకి వచ్చారే గాని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టంచేశారు. బీజేపీకి, డీఎంకేకి సిద్ధాంతాలపరంగా అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు.
మహిళా విభాగం నేతగానే..
కరుణానిధి అనేక కేసుల్ని ఎదుర్కొన్నారని, ఆయన జీవితాన్ని చూసి తానూ పాఠం నేర్చుకున్నట్టు తెలిపారు. తాను ఆనందంగా, ధైర్యంగా ఉండాలన్నదే తండ్రి ఆశయం అని చెప్పారు. 2జీ రూపంలో కాంగ్రెస్‌కూ కష్టాలు తప్పలేదని పేర్కొన్నారు. వారికి రాజకీయంగా పెద్ద నష్టం తప్పలేదన్నారు. 2జీని భూతద్దంలో పెట్టి చూపించ బట్టే బీజేపీ, అన్నాడీఎంకేలు అధికారంలోకి రాగలిగాయని విమర్శించారు. ఏదేని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే, అందులో ప్రభుత్వ నిబంధనలు, సిద్ధాంతాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయని, ఇవన్నీ పరిశీలించకుండా అనుమతులు ఇచ్చేయడం ఎవరి తరం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కోర్టు పర్యవేక్షణలో జరిగిన కేసు కాబట్టి తప్పకుండా న్యాయం తమవైపు ఉంటుందని ఎదురుచూశానన్నారు. ఇప్పుడే అదే జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment