రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తున్న సుహాసిని. చిత్రంలో బాలకృష్ణ
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. శనివారం నటుడు బాలకృష్ణతో కలసి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న ఆమె ఉదయం 11 గంటలకు నామినేషన్ సమర్పించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆమెతోపాటు బాలకృష్ణ, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మరో ఇద్దరు నాయకులు లోనికి వెళ్లారు. ఆమె నామినేషన్ దాఖలుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో టీడీపీ తప్ప మహాకూటమిలోని ఇతర పార్టీల నాయకులెవరూ హాజరుకాలేదు.
నామినేషన్‌కు ముందు, తర్వాత పలువురితో సెల్ఫీలు దిగిన ఆమె ఎలాంటి ప్రసంగం చేయలేదు. బాలకృష్ణ సైతం చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అయితే నామినేషన్ సందర్భంగా అభ్యర్థితోపాటు లోనికి నలుగురు మించి వెళ్లరాదనే నిబంధనలు ఉల్లంఘించినట్లు పలువురు ఆరోపించారు. నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, సాయికృష్ణ హాజరైనప్పటికీ, దివంగత హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరుకాలేదు. ప్రజా సేవకు సిద్ధపడుతున్నతన సోదరి సుహాసినిని విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment