
సాక్షి, చెన్నై: సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు తాను సిద్ధమని సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఎన్నికలకు ఎటువంటి వ్యూహం అవలంభిస్తామనేది వేచి చూడాలని అన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ బుధవారం ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ సమాధానాలిచ్చారు.
సినిమా రంగంలో సన్నిహిత మిత్రుడైన కమల్‌హాసన్‌తో రాజకీయాల్లోనూ చేతులు కలుపుతారా అని ప్రశ్నించగా.. కాలమే సమాధానం చెబుతుందని జవాబిచ్చారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తే ఏం చేస్తారని అడగ్గా... పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఎన్నికల వ్యూహం గురించి ప్రశ్నించగా.. వేచి చూడాలని సమాధానమిచ్చారు. తమ ప్రణాళికలో భాగంగా ఆఫీస్ బేరర్ల నియామకం జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే రజనీకాంత్ ప్రకటించారు. ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించి, అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయన శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది.
కాగా, ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే.. రజనీకాంత్ పార్టీ.. 16 శాతం ఓట్లతో 33 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే-కార్వి ఇన్‌సైట్స్ సర్వేలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment