
సాక్షి, అమరావతి: ఆపరేషన్ గరుడ, ద్రవిడ అవాస్తవాలు..అదంతా ఒక ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీశ్ రాంబొట్ల వ్యాఖ్యానించారు. కారెం శివాజీ మాదిరిగా హీరో శివాజీకి కూడా ఏదో పదవి వచ్చేవరకూ ఇలాగే చేస్తుంటాడని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. బీజేపీని తిడతారనుకుని టీడీపీ నేతలే పవన్ మీటింగ్‌కు జనాన్ని తరలించారని, కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని ధ్వజమెత్తారు.
టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ పవన్‌తో ఆడిస్తుంది.. జగన్‌తో కుమ్మక్కైంది అనే అవాస్తవాలు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి పొడిగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఆ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల మాత్రమే చేశారని వివరించారు. అదికూడా నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోనే ఇచ్చారని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. చంద్రబాబును కూడా ఉండాలని కోరినా తిరస్కరించారని వెల్లడించారు.
అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం కానీ అప్పుడు చంద్రబాబు ఏపీకి ఏం కావాలో కోరుకోలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇచ్చామన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నామనేది అవాస్తవమని చెప్పారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నది చంద్రబాబు కాదు.. బీజేపీ అని టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ అడిగితే ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వలేదనేది అవాస్తవమని.. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే, కానీ అవినీతి జరిగిందనేది వాస్తవమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment