ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్‌లతో పోల్చాలి | Opposition Leaders Meet Poll Body With Plea For More Paper | Sakshi
Sakshi News home page

ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్‌లతో పోల్చాలి

Published Tue, Feb 5 2019 4:40 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Opposition Leaders Meet Poll Body With Plea For More Paper - Sakshi

సోమవారం రాత్రి ఢిల్లీలో ఈసీని కలిసి వస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనకు ముందుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వెల్లడైన ఫలితాలను ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్స్‌(వీవీప్యాట్‌లు)లతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)ని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఫలితాలను వీవీ ప్యాట్‌లతో పోల్చి చూడాలనీ, సగం ఈవీఎంల ఫలితాలనైనా వీవీప్యాట్‌లతో సరిపోల్చి చూశాకే ఫలితాలను వెల్లడించాలని నేతలు కోరారు.

గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం కంటే తక్కువగా ఓట్ల తేడా ఉన్న సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలను వీవీప్యాట్‌లతో పూర్తిగా సరిచూసిన తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని తేలినట్లు వివరించారు. ఈసీని కలిసిన నేతల్లో కాంగ్రెస్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్, ఆనంద్‌ శర్మ, చంద్రబాబు నాయుడు(టీడీపీ), మజీద్‌ మెమన్‌(ఎన్‌సీపీ), డెరెక్‌ ఒ బ్రియాన్‌(టీఎంసీ), ఫరూఖ్‌ అబ్దుల్లా(ఎన్‌సీ) తదితరులున్నారు.

సాధ్యమైతే చేస్తాం:ఈసీ
ప్రతిపక్షాలు పేర్కొన్న అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్‌ అశోక్‌ లావాసా తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం ఓట్ల తేడా ఉన్నప్పుడు ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌లను పరిశీలించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement