సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఓడి పోయిన ప్రతి అభ్యర్థి నెపాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్లపైకి నెట్టడం నేడు ఫ్యాషన్ అయింది. అది సరే, ఓటర్లను విశ్వాసంలోకి తీసుకోకుండా ఓటింగ్ యంత్రాలను అదే పనిగా విమర్శించడం ఎక్కువైతే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్లనే నమ్మకం లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకంగా, మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ‘ఓటింగ్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల షెడ్యూల్‌తోపాటు మార్చి 13వ తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లే అనిపించింది.
ఈ వీవీపీఏటీని అంశం ఎప్పటి నుంచో సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలకు మరో భద్రతా వలయం ఉండాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఎన్నికల కమిషన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదంటూ వాదిస్తూ వస్తోంది. సుప్రీం కోర్టులో సోమవారం ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ అంతే మొండిగా వాదించింది. అన్ని పోలింగ్ బూత్‌ల్లో వీవీపీఏటీ వ్యవస్థను ఏర్పాటు చేయగలరా? అన్న సూచనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అలాంటి పోలింగ్ కేంద్రంలో ఎలాంటి తేడా రానప్పుడు మిగతా పోలింగ్ కేంద్రాల్లో తేడా రానట్లేనని వాదించింది. వీవీపీఏటీ వ్యవస్థను మరింత విస్తరించేది, లేనిది తెలియజేస్తూ ఓ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశిస్తూ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
మళ్లీ బ్యాలెట్ పత్రాల ఓటింగ్‌కు వెళ్లాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వసనీయతను పెంచేందుకు వీవీపీఏటీ వ్యవస్థను ప్రతి బూతుకు ప్రతి మిషన్‌కు విస్తరించాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక టెక్నాలజీ యుగంలోనూ యుగంలోను ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడమే కాదు, నిజంగా ట్యాంపరింగ్ జరగలేదని ప్రజలు విశ్వసించే విధంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment