ఎన్నికల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)కు బదులు బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని, లేదంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు రసీదు వచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అవి తమ డిమాండ్‌ను సాధించేందుకు ఏకమవుతున్నాయి కూడా.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం సాధించడానికి కారణం ఈవీఎంలను ట్యాంపర్ చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించడం, పాటిదార్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ దీనిపై పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల అంశం ముందుకు వచ్చింది.
ఈ అంశంపై చర్చించేందుకు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకుడు జనేశ్వర్ మిశ్రా నివాసంలో జరిగిన సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మినహా అందరు హాజరు కావడం విశేషం. ఈవీఎంలకు వ్యతిరేకంగా మొట్టమొదట ఆందోళన నిర్వహించినదీ మాయావతియేనని, ఈ అంశంపై మున్ముందు జరిగే సమావేశాలకు ఆమె తప్పకుండా హాజరు అవతారని ఆమె పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరయ్యాయి.
దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో దశల వారిగా ఓటుకు రసీదు వచ్చే యంత్రాలను ఉపయోగిస్తామని, అందులో భాగంగా ముందుగా ప్రతి నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ కేంద్రాల్లో వీటిని అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే అమలు చేయగలిగింది.
ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల అంశం డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినట్లయితే అన్నింటికీ ఓటు రసీదు వచ్చే పద్ధతి ఉండాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment