
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్లమెంట్ లోపల, వెలుపల బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు వ్యూహాన్ని రూపొందిస్తాయని సీపీఐ నేత డీ.రాజా చెప్పారు.గుజరాత్ ఫలితాలపై బీజేపీ స్పందన ఆధారంగా పాలక బీజేపీపై తమ ప్రచార వ్యూహాలకు ప్రతిపక్షాల సమన్వయ కమిటీ పదును పెడుతుందని అన్నారు.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ పార్టీ హిందుత్వ అజెండాపై దూకుడుగా వెళుతుందని తాము భావిస్తున్నామన్నారు.
బీజేపీ ఓటమి పాలైతే పార్లమెంట్ లోపల, వెలుపల ఆ పార్టీపై దాడిని తీవ్రతరం చేస్తామన్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తిన్నా ఆ పార్టీ దూకుడు తగ్గకపోవచ్చనేది మరో వాదనగా ముందుకొస్తోందన్నారు. ఏమైనా గుజరాత్ ఫలితాలను బట్టి బీజేపీపై తమ పోరాట వ్యూహాలకు పదును పెడతామని చెప్పారు.జీఎస్‌టీ, నోట్లరద్దు, నిరుద్యోగం, అసహన వాతావరణం వంటి అంశాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.
2014లో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడి కంపెనీ టర్నోవర్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిన అంశాన్నీ ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జాప్యం ప్రభుత్వం విపక్షాల దాడిపై ఇరకాటంలో పడిందనే సంకేతాలు పంపుతోందని అన్నారు.