బీకే హరిప్రసాద్ (ఫైల్ పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ పదవికి విపక్షాల అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఆగస్ట్ 9న ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆ మేరకు పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కాంగ్రెస్ అభ్యర్ధికి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను మద్దతు కోరారు. దీనిపై స్పందించిన నవీన్.. తాము ఇదివరకు జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్‌కు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. బిహార్ సీఎం నితీష్ కుమార్ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే.
బీజేపీకి బలం లేదు
రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదని, తమ అభ్యర్థి హరి ప్రసాద్ విజయానికి తగిన బలం ఉందని కాంగ్రెస్ పక్ష ఉప నేత ఆనంద్ శర్మ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ తమను సంప్రదించలేదని, తమతో సంప్రదించకుండానే అధికార పార్టీ అభ్యర్థిని నేరుగా ప్రకటించిందని ఆయన తెలిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా చాలా మంది పేర్లను పరిశీలించిన తనంతరం హరి ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
సభలో బలబలాలెంత
ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్‌ఎస్(6), వైఎస్సార్‌సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి.
Comments
Please login to add a commentAdd a comment