సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత అభ్యర్థుల జాబితాలో పటేల్ ఉద్యమ నేతలు కేవలం ఇద్దరికే చోటు దక్కడం పట్ల హార్థిక్ పటేల్ నేతృత్వంలోని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పటేల్ నేతలు తమకు కనీసం 20 సీట్లు కేటాయిస్తేనే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతామని తేల్చిచెప్పినా ఆదివారం అర్ధరాత్రి వెల్లడించిన తొలిజాబితాలో కేవలం ఇద్దరు పీఏఏఎస్ సభ్యులకే చోటు కల్పించడం పట్ల పటేల్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కాంగ్రెస్ తీరును నిరసిస్తూ సూరత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని పీఏఏఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. టికెట్లు దక్కిన లలిత్ వసోయ, అమిత్ తుమ్మార్‌లను నామినేషన్లు దాఖలు చేయవద్దని పటేల్ నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ప్రకటన చేస్తారని భావించిన రాజ్‌కోట్ ర్యాలీని టికెట్ల పంపిణీ రగడ నేపథ్యంలో హార్థిక్ పటేల్ రద్దు చేసుకున్నారు.77 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాపై పటేల్ నేతలు పెదవివిరిచారు.
ఈ జాబితాలో తమ వర్గీయులకు కాంగ్రెస్ సరైన ప్రాతినిథ్యం కల్పించలేదని, రాష్ట్రంలో ఆ పార్టీ కార్యాలయాల్లో పనులను స్తంభింపచేస్తామని సూరత్ పీఏఏఎస్ కన్వీనర్ ధార్మిక్ మాలవీయ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్‌సింహ్ సోలంకితో పీఏఏఎస్ కన్వీనర్ దినేష్ బంబానియా ఆయన మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. గుజరాత్‌లోని పలు చోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై పటేల్ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment