
సాక్షి, హైదరాబాద్: దాచేపల్లి ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని పోరాడిన తమ పార్టీ నేత ఆర్కే రోజాపై తెలుగుదేశం నాయకులు సంస్కార హీనంగా మాట్లాడటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తన అనుయాయులతో ఇలా మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. కీచకులను ప్రోత్సహిస్తూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.
తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బండారు సత్యనారాయణ, పంచమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలను పద్మజ తీవ్రంగా ఖండించారు. కాల్‌మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారని సీఎంపై మండిపడ్డారు.
ఐఏఎస్ అధికారిపై దాడికి పాల్పడిన వారిపైనా, దళిత మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. గడచిన ఐదేళ్ళుగా 12 ఏళ్ల చిన్నారులపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం శోచనీయమన్నారు. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో మిస్టరీలుగా మారుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఏ సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment