
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై గత రాత్రి నగరంలో పార్టీ తరపున నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న ఆయన స్పందించారు.
ముందు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాల కొనుగోలు ఆపేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలస్తీనా విషయంలో తటస్థ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్న భారత వైఖరిని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. జనవరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్హ్యు భారత్ లో పర్యటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వం ఆయా విషయాల్లో పునరాలోచన చేయటం మంచిదని ఒవైసీ హితవు పలికారు. ‘‘ట్రంప్ ప్రకటన ఒప్పందాల ఉల్లంఘన కిందకే వస్తుంది. తక్షణమే ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిది. అరబ్ దేశాలు, ఇస్లాం రాజ్యాలు కూడా ఈ విషయంలో ఇంకా మౌనంగా ఉండటం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాలస్తీనాకు మద్దతుగా భారత్ నిలవాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన జెరుసలెం నగరాన్ని పాలస్తీనా రాజధానిగానే గుర్తించాలి’’ అని ఒవైసీ ప్రసంగించారు.
ఇక ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటను ఒవైసీ గుర్తు చేశారు. ఫ్రెంచ్ వాళ్లు ఎలాగైతే ఫ్రాన్స్‌కు చెందుతారో.. అలాగే పాలస్తీనీయులు కూడా పాలస్తీనాకే చెందుతారు అని ఒవైసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1970 నుంచి ఇప్పటిదాకా అరబ్ దేశాల సరిహద్దుల్లో మోహరించిన ఇజ్రాయోల్ సైన్యాన్ని తక్షణమే ఎత్తివేయాలన్న డిమాండ్‌ను ఒవైసీ గట్టిగా వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment