సాక్షి, గుంటూరు : నరసరావుపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పిన్న వయస్కుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు రికార్డు సృష్టించారు. తొలి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ‘సాక్షి’కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందేది తానేనని, పల్నాడు ప్రజల ఆశలు తీర్చటమే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టంచేశారు.
ప్రశ్న : పల్నాడు ప్రాంతం నుంచి పోటీచేయడాన్ని మీరు ఏవిధంగా భావిస్తున్నారు?
జవాబు: చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో చరిత్ర ఉన్న పల్నాడు సీమను అభివృద్ధి చేసే అవకాశం రావటం నా జీవితంలోనే గొప్ప విషయం.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
జవాబు: నరసరావుపేట ఎంపీగా ఈ ఎన్నికల్లో నేనే గెలవబోతున్నా. పల్నాడు ప్రజలు అఖండ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 సీట్ల వరకు రాబోతున్నాయి. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మూడు దశాబ్దాలపాటు మేము నవ్యాంధ్రకు సువర్ణ పాలన అందించబోతున్నాం.
ప్రశ్న: గెలుపుపై అంత నమ్మకం ఎలా వచ్చింది?
జవాబు: నరసరావుపేట పార్లమెంటు సమన్వయకర్తగా మా పార్టీ నన్ను ఆరునెలల క్రితం నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్య, వారితోనే తిరుగుతున్నా. ఇప్పటి వరకు 900 గ్రామాలకు పైగా సందర్శించా. 70 వేలకు పైగా కిలోమీటర్లు తిరిగి 12 లక్షల మందికి పైగా ప్రజలను కలిశా. ఇదంతా నాకు ఎంతో మేలు చేసింది. ప్రజల నాడి తెలిసింది. టీడీపీ ఐదేళ్లపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఎదురుచూస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌పై జనానికి ఉన్న నమ్మకం వారి మాటల్లోనే ప్రతిబింబిస్తోంది.
ప్రశ్న: పార్లమెంటు స్థానం పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలను గుర్తించారా?
జవాబు : సమస్యలు చాలా ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేసేందుకు ఐదు నెలల కిందటే 50 మందితో ఒక కమిటీని ఏర్పాటుచేశా. వారు ప్రతి గ్రామాన్నీ సందర్శించి ప్రజల సమస్యలపై సమగ్రమైన నివేదిక అందజేసింది.
ప్రశ్న: ఆ కమిటీ మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమిటి?
జవాబు : వందల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. సాగునీరులేక అన్నదాతలు ఐదేళ్లుగా అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోగా, వర్షాలు లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత ఆందోళన చెందుతోంది. పార్లమెంటు పరిధిలో ఒక్క యూనివర్సిటీ లేదు. ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఘన చరిత్ర గల ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క మెడికల్ కళాశాల లేకపోవటం బాధ కలిగిస్తోంది. పల్లెల్లో పేదలకు కూలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉంది. ఆర్టీసీ బస్సు ముఖం చూడని పల్లెలు ఇంకా ఉన్నాయి. ప్రధాన రహదారులు విస్తరణ లేక రోజూ ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
ప్రశ్న: మీరు గెలిచి అధికారంలోకి వస్తే సాగునీటి సమస్య తీరుస్తారా? అదెలా సాధ్యం?
జవాబు: తప్పకుండా సాగునీటిసమస్య తీర్చొచ్చు. గోదావరి జలాలను పల్నాడుకు పరుగులు పెట్టించొచ్చు. రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే చాలు కృష్ణానదితో సంబంధం లేకుండా సాగర్ కాలువలను గోదావరి జలాలతో నింపొచ్చు. పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తిచేసుకుంటే గోదావరి జలాలను పులిచింతలకు తీసుకురావచ్చు. అమరావతి మండలం వైకుంఠపురం వద్ద ఒగ మెగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటే అక్కడి నుంచి గోదావరి జలాలను నకరి కల్లు అడ్డరోడ్డు వద్ద సాగర్ జలాల్లో కలపొచ్చు. ఈ కాలువ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను బుగ్గవాగు రిజర్వాయర్‌కు తరలించుకుంటే పల్నాడు మొత్తానికి సాగునీరు అందుతుంది. కేవలం రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయొచ్చు. పోలవరం పూర్తయ్యేలోగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తెచ్చుకొని పల్నాడును రతనాల సీమగా మార్చుకోవచ్చు. మేం గెలిస్తే ఇదే మా ప్రథమ ప్రాధాన్యం అవుతుందనటంలో సందేహమే లేదు.
ప్రశ్న: తాగునీటి సమస్యను ఏవిధంగా పరిస్ఖరిస్తారు?
జవాబు : సాగర్ కాలువల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పల్నాడు పల్లెలు అన్నింటికీ తాగునీరు అందించొచ్చు. కేవలం రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో తాగునీటి గ్రిడ్లను నిర్మించి అన్నీ గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలను తరలించే ఉద్దేశంతో రూ.80 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూలన పడినా ఎవరూ పట్టించుకోలేదు.
ప్రశ్న: పల్నాడు అభివృద్ధికి మీ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
జవాబు : పల్నాడులో ఎక్కువగా మిరప, పత్తి పండిస్తారు. ఈ రెండు పంటలకు మద్దతు ధర దక్కాలంటే వరంగల్ తరహాలో ఓ పత్తి విక్రయం కేంద్రం, గుంటూరు తరహాలో మిర్చి యార్డును ఇక్కడ అభివృద్ధి చేయాలి. వంద ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టాలు ఎక్కించాలి. 500 ఎకరాల్లో మెగా టూరిజం పార్కు, మూడు వందల మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఈ ఫైళ్ల బూజును దులపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రశ్న: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?
జవాబు : చాలా బాగా సాగుతోంది. విరామం లేకుండా ప్రజల్లోనే ఉంటున్నా. నేనే కాదు నా కోసం నా భార్య మేఘన, చెల్లెలు రుద్రమదేవి విరామంలేకుండా కష్టపడుతున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలోనే ఉంటూ నాకు మద్దతుగా నిలుస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నగారు లావు రత్తయ్య క్షేత్రస్థాయిలో నా విజయంకోసం శ్రమిస్తున్నారు.
ప్రశ్న: ఓటర్లకు ఏమైనా చెబుతారా?
జవాబు : నాయకుడు పరిగెత్తే స్థితిలో ఉంటేనే ప్రజలు ఆయనతో పరిగెత్తగలరు. నాయకుడు, ప్రజలు కలిస్తే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. నాయకుడు కనీసం నడవలేని స్థితిలో ఉంటే ప్రజలకు లాభం ఉండదు. ఓట్లు వేయించుకొని ఆ తర్వాత కన్పించకుండా వెళ్లిపోయే మనస్తత్వం నాదైతే కాదు. మా నాయకుడు నాకు నరసరావుపేట బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నేను ఇక్కడి ప్రజల మధ్యనే ఉంటున్నా. వారి సమస్యలు వింటూనే ఉన్నాను. పని చేసేవారెవరో, స్థానికంగా అందుబాటులో ఉంటున్న వారెవరో, ఉత్సాహంగా జనంతో కలిసి తిరుగుతున్న వారెవరో గుర్తించి ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
పల్నాడు అభివృద్ధే లక్ష్యం
Published Mon, Apr 8 2019 8:29 AM | Last Updated on Mon, Apr 8 2019 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment